పవార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

ప్రధానాంశాలు

పవార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం కోసమేనా!

ముంబయి, దిల్లీ, ఈనాడు: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. ముంబయిలోని పవార్‌ ఇంట్లో సాగిన ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పవార్‌ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజనానికి వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీల ఎన్నికల్లో బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్‌ల తరఫున పీకే విజయవంతంగా ప్రచార వ్యూహాలు రచించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్‌-పవార్‌ భేటీలో.. భాజపాయేతర పార్టీలను, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయటం; 2024 ఎన్నికల నాటికి మోదీకి దీటుగా నాయకత్వాన్ని ప్రతిపాదించటం, ముంబయి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ భాజపాను దెబ్బతీయటం; రాబోయే ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ లాంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని ఓడించటంపై చర్చించినట్లు సమాచారం. మమత 2024నాటికి భాజపాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశిస్తున్నారు. ఈ విషయంలో ఆమె పవార్‌ సాయాన్ని కోరుకుంటున్నారని విశ్లేషకుల మాట. అయితే ఆమెకు పవార్‌ ఏమేర దోహదపడతారనేది సందేహమే. కారణం- భాజపా బలహీనపడటం పవార్‌కూ కావాలి. కానీ 2024 ఎన్నికల కోసం కాదు. 2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల గురించి! వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా (ఎన్డీయే) తన సొంతబలంపై కాకుండా.. ఇతరుల మద్దతు తీసుకునే స్థితికి రావాలన్నది పవార్‌ ఎత్తుగడ. త్వరలో జరిగే అసెంబ్లీల ఎన్నికల్లో భాజపా దెబ్బతింటే తాను కోరుకున్న అభ్యర్థిని కాకుండా ఏకాభిప్రాయ వ్యక్తికోసం రాజీపడాల్సి వస్తుంది. అప్పుడు తనకు పరిస్థితి అనుకూలంగా మారుతుందనేది పవార్‌ ఆలోచనగా చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని