Eatala: నియంతృత్వం నుంచి విముక్తే ఎజెండా
close

ప్రధానాంశాలు

Eatala: నియంతృత్వం నుంచి విముక్తే ఎజెండా

కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటం
  మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతా: ఈటల రాజేందర్‌
  రాజీనామా లేఖ సమర్పణ.. తక్షణమే ఆమోదించిన స్పీకర్‌  
  రేపు దిల్లీకి వెళ్లి కమలదళంలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమే. కౌరవులు, పాండవుల మధ్య అక్కడ యుద్ధం జరగనుంది. నియోజకవర్గ ప్రజలు, వారికి తోడుగా ఉండే తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాజీనామా చేస్తున్నా. లెఫ్టూ రైటూ కాదు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటమే నా ఎజెండా’ 

ఈటల రాజేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే నారాయణగూడ: మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయ్యాక తెరాసను వీడిన ఈటల శనివారం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. తాను ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్‌ స్థానానికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరుతూ ఆయన శనివారం ఉదయం సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంలో లేఖను అందజేశారు. అనంతరం పరిశీలించిన స్పీకర్‌ దాన్ని ఆమోదించగా..శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా శాసనసభలో హుజూరాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ జారీ అయింది. అంతకు ముందు ఈటల భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డితో కలిసి తన నివాసం నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి నివాళి అర్పించి విలేకరులతో మాట్లాడారు. 14న దిల్లీకి వెళ్లి భాజపాలో చేరతామన్నారు. ‘రానున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించి హుజూరాబాద్‌ ఆత్మగౌరవాన్ని నిలబెడతా. అధికారపక్ష ప్రలోభాల్ని, డబ్బు ప్రభావాన్ని అధిగమించి అసెంబ్లీలో అడుగుపెడతా. కరోనాతో వేలమంది చనిపోయినా, లక్షల మంది ఇబ్బందిపడతున్నా, వడ్లు తడిసి మొలకలతో రైతులు నష్టపోయినా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి వచ్చే ఉప ఎన్నికపైనే ఆయన దృష్టిపెట్టారు.
జైళ్లు, కేసులు కొత్త కాదు
2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలో చేరి నిస్సిగ్గుగా మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.వేల కోట్ల డబ్బుంది.ఉపఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతారు. రాజీనామా చేయొద్దంటూ కొందరు నాతో చర్చించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమ సహచరులకు నా విజ్ఞప్తి. హుజూరాబాద్‌కు జరిగే ఎన్నికల సంగ్రామం ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు. కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగే పోరాటం. నేను ఇన్నాళ్లు లెఫ్ట్‌ ఎజెండాలో ఉన్న వాడిని. లౌకికవాదమే నా డీఎన్‌ఏలో ఉంది. రానున్నరోజుల్లోనూ కులమతాలకతీతంగా అందరి మనిషిలా ఉంటా. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవం నిలబెడతానని మీ బిడ్డగా ప్రమాణం చేస్తున్నా. ఈ పోరాటంలో మీరు స్ఫూర్తినివ్వాలి. మా పార్టీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలు రావంటూ పింఛన్లు, రైతుబంధు ఆగిపోతాయంటూ అధికార పక్షం అప్పుడే వెకిలి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నా మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నన్ను చక్రబంధంలోకి నెట్టేందుకు పోలీసులను వినియోగిస్తున్నారు. హుజూరాబాద్‌ గడ్డకు, మా వాళ్లకు జైళ్లు, కేసులు, నిర్బంధాలు కొత్తకాదు.

హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా

శాసనసభాపతిని కలిసి రాజీనామా ఇచ్చేందుకు వారం రోజులుగా ప్రయత్నించినా కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని స్పీకర్‌ రాలేదు. గత్యంతరం లేని స్థితిలో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా ఇచ్చా. త్వరలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించి, కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిని గెలిపించేందుకు తెరాస ఆయనకు డబ్బు సాయం చేసి నీచ రాజకీయం చేసింది. దిల్లీలో కొవిడ్‌ పరిస్థితుల కారణంగా కొద్దిమంది నేతలతోనే అక్కడికి వెళ్లి భాజపాలో చేరతా. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి భారీగా చేరికలుంటాయి’ అని ఈటల చెప్పారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని