మేమంతా కేసీఆర్‌ వెంటే: శ్రీనివాస్‌గౌడ్‌
close

ప్రధానాంశాలు

మేమంతా కేసీఆర్‌ వెంటే: శ్రీనివాస్‌గౌడ్‌

గజ్వేల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారని, తాము కూడా ఆయన వెంటే నడుస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన ఎక్సైజ్‌ కార్యాలయాన్ని, గజ్వేల్‌ మండలం కొడకండ్లలో రూ.3.72 కోట్లతో నిర్మించిన 56 రెండు పడకగదుల ఇళ్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో జరిగిన అభివృద్ధిని 2014కు ముందుతో బేరీజు వేసి చూడాలన్నారు. తన ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఆయన ఇక్కడ పుట్టడమే ప్రజల అదృష్టమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూస్తుంటే.. ఇందుకే రాష్ట్రం తెచ్చుకున్నామని అనిపిస్తోందన్నారు. ప్రభుత్వంతో అన్ని విధాలా లబ్ధి పొందినవారు విమర్శలు చేయటం ఆకాశంపైకి ఉమ్మేసినట్లేనని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.
త్వరలో సొంత స్థలాల్లో రెండు పడక గదుల ఇళ్లు: మంత్రి హరీశ్‌రావు
త్వరలో సొంత స్థలాల్లో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా ధాన్యం పండిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో రాష్ట్ర ప్రజల దాహార్తి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్‌లోని ఎక్సైజ్‌ కార్యాలయం ఆవరణతో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదవులు అనుభవించి తెరాసను వీడారు: మంత్రి మల్లారెడ్డి
రసూల్‌పురా, న్యూస్‌టుడే: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కోట్లు సంపాదించి, అన్నీ అనుభవించి తెరాసను వీడారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని రసూల్‌పురాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌తో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమీ తక్కువ చేయలేదన్నారు. రాజేందర్‌ అక్రమంగా భూములు సంపాదించారన్నారు. ఆయన భాజపాలోనే కాదు.. ఏ పార్టీలోకి వెళ్లినా ఓడిపోవడం ఖాయమన్నారు. ఈటల మోసగాడని వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని