రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు
close

ప్రధానాంశాలు

రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు

భూముల అమ్మకాలపై కాంగ్రెస్‌, భాజపాలది గురివింద తీరు
మంత్రి హరీశ్‌రావు విమర్శ

ఈనాడు, సంగారెడ్డి: నిరర్ధక ఆస్తులను అమ్మి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని, ఇదే విషయాన్ని బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగానూ స్పష్టంగా చెప్పామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, భాజపా నేతలు మాత్రం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కేవలం తెలంగాణలోనే భూములు అమ్ముతున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. వారి వ్యవహారం గురివింద తీరుగా ఉందని, తాము అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టామని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశం, కుటిల నీతితోనే కాంగ్రెస్‌, భాజపాలు ఈ అంశంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏకంగా 88,500 ఎకరాలను అమ్మేశారని ఆరోపించారు. అసలు భూముల అమ్మకాలను మొదలుపెట్టిందే కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే... అమ్మిన భూములను తిరిగి తీసుకుంటామని భట్టి విక్రమార్క మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పట్లో ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. హైదరాబాద్‌లోని భూములను విక్రయించి రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలకు ఆ డబ్బులను తరలిస్తుంటే... అసెంబ్లీలో తాను ప్రశ్నించానని మంత్రి గుర్తు చేశారు. ఆ సొమ్మును తెలంగాణ కోసమే వెచ్చించాలని డిమాండ్‌ చేశామన్నారు.

జల్దీ.. జల్దీ... అమ్మాలంటూ కేంద్రం లేఖ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు లేఖ రాసిందని హరీశ్‌ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను జల్దీ జల్దీ అమ్మాలని అందులో పేర్కొందన్నారు. అలా ముందుగా అమ్మే రాష్ట్రాలకు బహుమతి ఇస్తామని ప్రోత్సహిస్తుందని తెలిపారు. విశాఖ ఉక్కు మొదలు బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌... ఇలా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న ఎన్నో సంస్థలను కేంద్రం అమ్మేస్తోందన్నారు. ఇక్కడున్న ఆ పార్టీ నేతలు మాత్రం వారి ప్రభుత్వ తీరుపైనే ఉల్టా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఒక్క ఏడాదిలో పెట్రోలుపై రూ.25, డీజిల్‌పై రూ.23 పెంచిందన్నారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ పంట సాగుపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పర్యావరణ అనుకూల పంట అయిన ఆయిల్‌పాం సాగును పెంచేందుకు అన్ని శాఖలు కృషి చేయాలన్నారు. ఈ పంట సాగు పెంచడానికి మొక్కల కొరత ఉందని, నర్సరీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌పాం సాగుతో రైతులకు ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పంట సాగు విస్తీర్ణం బాగా పెంచాలని ఆయన రైతులు, అధికారులను కోరారు. సమావేశంలో వ్యవసాయ, అటవీ శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని