ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే 3 రాజధానులు
close

ప్రధానాంశాలు

ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే 3 రాజధానులు

ఏపీలో రెండేళ్ల పాలనపై మావోయిస్టు కార్యదర్శి గణేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాల’ వల్ల ఒనగూరింది ఏమీలేదు. వాటితో ప్రజలను ప్రభుత్వంపై ఆధారపడే పరాన్నజీవులుగా మార్చుతున్నారు’ అని మావోయిస్టు పార్టీ ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనపై గణేశ్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసి.. ఆ భారాన్ని తిరిగి ప్రజలపైనే మోపి పన్నుల రూపంలో వసూలు చేస్తోందని ఆరోపించారు. ‘బూటకపు పథకాలతో ప్రజలను పరాన్న జీవులుగా మార్చడమేనా అభివృద్ధి? యువతకు ఉపాధి కోసం కొత్త పరిశ్రమలు తేకపోగా.. ఉన్న వాటినీ ప్రైవేటీకరిస్తూ ఉద్యోగాలు కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ప్రజల మౌలిక సమస్యలను పక్కదారి పట్టించడానికి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. నాడు తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. తమకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా తెచ్చి చూపిస్తామన్న నేత ఇప్పుడు తాను అవినీతి, అక్రమాల కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలోని మోదీ, అమిత్‌ షాల పాదాల ముందు మోకరిల్లి ఆ డిమాండును పక్కన పెట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అధికారాలను కట్టబెట్టి నిజమైన దేశభక్తులపై ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగిస్తోంది. వీటికి జగన్‌ ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. గ్రామ వాలంటీరు వ్యవస్థను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు. చివరికి ఇది పెద్ద అవినీతి వ్యవస్థగా మారుతోంది.’ విశాఖ మన్యంలో  మళ్లీ బాక్సైట్‌ తవ్వకాలకు సిద్ధం అవుతోంది. దీనిపై పోరాడేందుకు ఆదివాసులకు అండగా ఉండకూడదని సీపీఐ మావోయిస్టు పార్టీ లేకుండా చేయాలని చూస్తోంది’ అని గణేశ్‌ విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని