ఆ జడ్జి మాకొద్దు..
close

ప్రధానాంశాలు

ఆ జడ్జి మాకొద్దు..

నందిగ్రాం ఎన్నికల పిటిషన్‌పై మమత

కోల్‌కతా: బెంగాల్‌లోని నందిగ్రాం నుంచి సువేందు అధికారి ఎన్నికపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్‌ కోల్‌కతా హైకోర్టులో 24న విచారణకు రానుండగా.. అనూహ్య మలుపు తిరిగింది. నందిగ్రాం ఫలితాన్ని సవాలు చేస్తూ పలు అక్రమాలు చోటుచేసుకున్న ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించవలసిందిగా మమత కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ కౌశిక్‌ చందా ఈ పిటిషన్‌ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి అనుగుణంగా వేశారా అనే విషయమై ఓ నివేదిక సమర్పించవలసిందిగా హైకోర్ట్‌ రిజిస్ట్రారుకు ఆదేశాలు జారీ చేశారు. కేసును జూన్‌ 24కు వాయిదా వేశారు. ఈ దశలో.. భాజపా నేపథ్యం ఉన్న జస్టిస్‌ కౌశిక్‌ చందా పిటిషన్‌ విచారిస్తే తమకు న్యాయం జరగదని, కేసును మరో ధర్మాసనం ముందుకు మార్చవలసిందిగా మమత తరఫు న్యాయవాది శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ కార్యదర్శికి లేఖ రాశారు. జస్టిస్‌ కౌశిక్‌ చందాను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించటంపై కూడా సీఎం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వ వైఖరికి మద్దతుగా కొంతమంది న్యాయవాదులు కోల్‌కతా హైకోర్టు ఎదుట నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు.  
ముకుల్‌ను అనర్హుడిగా ప్రకటించండి : సువేందు
భాజపా నుంచి టీఎంసీలో చేరిన  ముకుల్‌రాయ్‌ శాసనసభ్యత్వాన్ని పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద రద్దు చేయవలసిందిగా సువేందు శుక్రవారం శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు సమర్పించారు. టీఎంసీ ఎంపీగా గెలిచి, అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలోకి ఫిరాయించిన తన తండ్రి సిసిర్‌ అధికారిని ఈ విషయం అడగాలంటూ టీఎంసీ నేతలు సువేందుపై ఎదురుదాడికి దిగారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని