దుబ్బాకలా హుజూరాబాద్‌లో గెలవాలి
close

ప్రధానాంశాలు

దుబ్బాకలా హుజూరాబాద్‌లో గెలవాలి

ఉప ఎన్నికపై కమలదళం వ్యూహరచన
నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జిగా జితేందర్‌రెడ్డి నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కమలదళం సన్నద్ధమవుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ఖరారు చేసింది. మండలాలవారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉపఎన్నికపై సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు జి.వివేక్‌వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.చంద్రశేఖర్‌, పి.చంద్రశేఖర్‌, సీనియర్‌నేత ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు హాజరయ్యారు. సెప్టెంబరు నెలాఖరు లేదా అక్టోబరు తొలివారంలో ఉప ఎన్నిక రావచ్చని కొందరు నేతలు అంచనా వేశారు. ప్రత్యేక వ్యూహంతో దుబ్బాకలా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించాలని కమలనాథులు అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికే హుజూరాబాద్‌ బాధ్యతల్ని అప్పగించారు. యండల లక్ష్మీనారాయణ, ఎ.చంద్రశేఖర్‌లను సహ ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ సమావేశంలో ప్రకటించారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తన విజయానికి పార్టీలో అందరూ సహకరించాలని ఈటల కోరారు. ‘మీ కుటుంబసభ్యుల్లో నన్నూ ఒకడిగా చూడండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. కలసికట్టుగా పోరాడితే గెలుపు కష్టం కాదు’ అని మాజీ మంత్రి అన్నట్లు సమాచారం. ‘అమేథిలో రాహుల్‌గాంధీ ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. మనం ఓడించాం. హుజూరాబాద్‌లో అందరం గట్టిగా పోరాడితే  ఈటల గెలుపును ఎవరూ ఆపలేరు..’అని తరుణ్‌ఛుగ్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తొలిసారి సోమవారం వచ్చిన ఈటలకు బండి సంజయ్‌ శాలువా కప్పి ఆహ్వానించారు. ఈటల నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని కొనియాడారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఏకపక్షమేనని, రూ.కోట్లు ఖర్చుచేసినా తెరాసకు డిపాజిట్టు రాదని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాళ్లు మొక్కించుకోవటం సిగ్గుచేటన్నారు.

జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

పార్టీ జిల్లా శాఖలకు ఇన్‌ఛార్జులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం ప్రకటించారు. పార్టీ పరంగా 38 జిల్లా శాఖలున్నాయి. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జుల వివరాలు.. ఆదిలాబాద్‌-అల్జాపూర్‌ శ్రీనివాస్‌, మంచిర్యాల-పల్లె గంగారెడ్డి, నిర్మల్‌ జి.మనోహర్‌రెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌-జె.శ్రీకాంత్‌, నిజామాబాద్‌-మీసాల చంద్రయ్య, కామారెడ్డి-బద్దం మహీపాల్‌రెడ్డి, కరీంనగర్‌-ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, జగిత్యాల-చంద్రశేఖర్‌, పెద్దపల్లి-రావుల రాంనాథ్‌, రాజన్న సిరిసిల్ల-మోహన్‌రెడ్డి, సంగారెడ్డి-బొమ్మ జయశ్రీ, మెదక్‌-ఎస్‌.మల్లారెడ్డి, సిద్దిపేట-టి.అంజయ్యకుమార్‌గౌడ్‌, రంగారెడ్డి అర్బన్‌- యండల లక్ష్మీనారాయణ, రంగారెడ్డి రూరల్‌-బి.శోభారాణి, వికారాబాద్‌-కాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ అర్బన్‌-బి.శాంతికుమార్‌, మేడ్చల్‌ రూరల్‌-నరేందర్‌రావు, నల్గొండ-ఆర్‌.ప్రదీప్‌, సూర్యాపేట-చాడ శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి-ఎస్‌.నందకుమార్‌యాదవ్‌, మహబూబ్‌నగర్‌-జి.భరత్‌గౌడ్‌, వనపర్తి-బి.ప్రతాప్‌, నాగర్‌కర్నూల్‌-కొల్లి మాధవి, జోగులాంబ గద్వాల-బి.వెంకట్‌రెడ్డి, నారాయణపేట-ఎం.కాంతారావు, వరంగల్‌ అర్బన్‌-మురళీధర్‌గౌడ్‌; వరంగల్‌ రూరల్‌-ఎం.శ్రీనివాస్‌గౌడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి-ఎస్‌.ఉదయ్‌ప్రతాప్‌, జనగాం-పి.పాపారావు, మహబూబాబాద్‌-కట్టా సుధాకర్‌, ములుగు-బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఖమ్మం-కడగంచి రమేశ్‌, భద్రాద్రి కొత్తగూడెం-రాకేశ్‌రెడ్డి, గోల్కొండ గోషామహల్‌- రతన్‌ పాండురంగారెడ్డి, భాగ్యనగర్‌ మలక్‌పేట-ఎస్‌.కుమార్‌, మహంకాళి సికింద్రాబాద్‌-నాగురావు నామాజి, బర్కత్‌పుర అంబర్‌పేట-గోలి మధుసూదన్‌రెడ్డి. వీరు కాక తొమ్మిది జిల్లాలకు సహ ఇన్‌ఛార్జులను సంజయ్‌ ప్రకటించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని