సిద్ధూతో రాజీ కుదిరేనా?
close

ప్రధానాంశాలు

సిద్ధూతో రాజీ కుదిరేనా?

ఏఐసీసీ త్రిసభ్య కమిటీతో అమరీందర్‌ భేటీ

దిల్లీ: వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మరోసారి గెలుపు బాటలో నడిపించాలంటే పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించిన అధిష్ఠానం ఆ దిశగా కసరత్తులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, మాజీ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్ధూల మధ్య నెలకొన్న అగాధాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముగ్గురు ఏఐసీసీ సభ్యుల కమిటీ ఇప్పటికే తమ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఉన్న రాజీ ఫార్ములా ఏమిటో తెలియాల్సి ఉంది. సిద్ధూకి సరైన ప్రాతినిధ్యం కల్పించి అమరీందర్‌ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోవాలని అధ్యక్షురాలు సోనియాకి అందులో సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్లీకి వచ్చిన సీఎం అమరీందర్‌.. కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్‌ పార్టీ వ్యవహారాల బాధ్యుడు హరీశ్‌ రావత్‌; మాజీ ఎంపీ జె.పి.అగర్వాల్‌తో భేటీ అయ్యారు. ఏఐసీసీ త్రిసభ్య కమిటీ సభ్యులైన వీరితో అమరీందర్‌ సమావేశం మూడు గంటలకుపైగా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఐక్యంగా నడిపించే అంశంతో పాటు సిద్ధూ ఇటీవల బహిరంగంగా చేస్తున్న విమర్శలనూ అమరీందర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. కమిటీ కూడా సిద్ధూ ఇంటర్వ్యూలు, వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విబేధాలను పార్టీ అంతర్గత వేదికలపైనే సామరస్యంగా పరిష్కరించుకొని సోనియా, రాహుల్‌ గాంధీల నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుదామని ఖర్గే పేర్కొన్నట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని