దళితులపై పెరిగిన అఘాయిత్యాలు
close

ప్రధానాంశాలు

దళితులపై పెరిగిన అఘాయిత్యాలు

మరియమ్మ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
డీజీపీని కలిసిన ఉత్తమ్‌, భట్టి, సీతక్క

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాత దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ చనిపోయిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘‘ఎస్సైని, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతో సరిపోదు. బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం కింద కేసు నమోదు చేయాలి. మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కుటుంబానికి పరిహారం ఇప్పించాలి’’ అని కోరారు. ఉదయ్‌కిరణ్‌పై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ ఫొటోలను అందజేశారు.

ఏపీ కొత్త ప్రాజెక్టులను పట్టించుకోని ప్రభుత్వం: భట్టి
కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుందని ఏడాది క్రితమే తాము చెప్పినప్పటికీ తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి 80 వేల క్యూసెక్కులు కలిపి రోజుకు 11 టీఎంసీలను తీసుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ఏడాది క్రితమే జీవోలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు మేల్కొన్న సీఎం కేసీఆర్‌, మంత్రులు తెలంగాణను కాపాడేందుకు నీళ్ల యుద్ధం చేయనున్నట్లు ప్రకటించడం ద్వారా కొత్త డ్రామాకు తెరదీశారని ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికిగానూ టెండర్లకు వెళ్లినా కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన అపెక్స్‌ మీటింగ్‌కు వెళ్లకుండా తెలంగాణ నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీ అదనంగా నీటిని తరలించుకుపోతే ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమకాలువ ఆయకట్టుకు నష్టం జరుగుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు నిండదని తెలిపారు. కృష్ణాజలాల అంశంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని