విద్యార్థులపై దాడులను సహించం
close

ప్రధానాంశాలు

విద్యార్థులపై దాడులను సహించం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌, కవాడిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనను ప్రశ్నిస్తున్న ఉస్మానియా విద్యార్థులపై దాడులను సహించమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. ‘ఓయూలో న్యాయవిద్య అభ్యసిస్తున్న సురేశ్‌యాదవ్‌ సోమవారం తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు గంగాదేవి పూజకు వెళ్లారు. ఆయన తరచూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెరాసకు చెందిన కొందరు గుండాలు కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు’ అని మండిపడ్డారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్‌యాదవ్‌ను ఆయన పరామర్శించారు.

18 ఏళ్లపైబడ్డ వారికి టీకాలు వేయరా?
దేశంలో 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్లు వేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ మాటల్ని ఇతర రాష్ట్రాలు అమలుచేస్తుంటే, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం యువతీయువకుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందని సంజయ్‌ విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ తెలంగాణ ప్రాంత ప్రశిక్షణా విభాగం ఆధ్వర్యంలో ఈ-చింతన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ..కేవలం ఏడేళ్ల పాలనలోనే ప్రధాని మోదీ దేశంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని అన్నారు.

శ్యామాప్రసాద్‌ ముఖర్జీకి నివాళిగా మొక్కలు నాటుదాం
జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ‘బలిదాన్‌ దివస్‌’ను భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. బండి సంజయ్‌.. శ్యామాప్రసాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జులై 6న శ్యామాప్రసాద్‌ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా  మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌రాథోడ్‌, ప్రేమేందర్‌రెడ్డి, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని