ఏపీ పాలకులపైనే ఆ వ్యాఖ్యలు
close

ప్రధానాంశాలు

ఏపీ పాలకులపైనే ఆ వ్యాఖ్యలు

ప్రజలను ఉద్దేశించి కాదు
వైఎస్‌ తెలంగాణ పాలిట రాక్షసుడే
జగన్‌ అంతకంటే ఎక్కువ: మంత్రి వేముల

ఈనాడు, హైదరాబాద్‌: తమ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టిన, కట్టే ప్రయత్నం చేస్తున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించే తాను మంగళవారం మహబూబ్‌నగర్‌లో మాట్లాడానని, రాయలసీమ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథ్‌రెడ్డి, ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు దీనిని గుర్తించాలన్నారు. ఏపీ పాలకులపై తన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి అని, సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా ఆయనే అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం అయ్యారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో అరాచకాలకు పాల్పడిన వ్యక్తి అని, ఆయన ముమ్మాటికి తెలంగాణ పాలిట రాక్షసుడేనని దుయ్యబట్టారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించిన నీటి దొంగేనన్నారు. వైఎస్‌ని మించి రెట్టింపు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఏమనాలి? అని మంత్రి వేముల ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను తేల్చడానికి ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్నారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడుతామన్నారు.

ఇరు రాష్ట్రాల రైతుల బాగే.. కేసీఆర్‌ కోరేది
మహబూబ్‌నగర్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రజలతో తెలంగాణ ప్రజానీకం, ఇక్కడి ప్రభుత్వం సోదరభావంతో మెలుగుతోంది. ఆంధ్ర, తెలంగాణ రైతులు బాగుండాలనేదే కేసీఆర్‌ విధానం. ఒక్క శ్రీశైలం నుంచే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లిప్టు ద్వారా రోజుకు 9.12 టీఎంసీల నీటిని మళ్లించే అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతున్నది ఏపీ సర్కారే. మా పాలమూరు, డిండి ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు పొందిన పాత ప్రాజెక్టులు. ఇప్పటికైనా జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టే ఆదేశాలను పాటించి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం పనులు ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా.

సోము, సంజయ్‌ బాధ్యత తీసుకోవాలి..
కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్ర నీటి వాటాను త్వరగా తేల్చమని కృష్ణా ట్రైబ్యునల్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని కోరదాం. సోము వీర్రాజు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ బాధ్యత తీసుకోవాలి. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వం కడుతున్న ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయాలి’’ అని ప్రశాంత్‌రెడ్డి కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని