ఏపీ నాయకులు ఇప్పుడేం చెబుతారు?
close

ప్రధానాంశాలు

ఏపీ నాయకులు ఇప్పుడేం చెబుతారు?

రాయలసీమ ఎత్తిపోతల అక్రమమేనని కృష్ణా బోర్డు తేల్చింది
మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని కృష్ణా బోర్డు ఆదేశంతో తేలిపోయిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా రాయలసీమ ఎత్తిపోతలను కట్టవద్దని ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలతో కలిసి ప్రశాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని యత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే రాద్ధాంతం చేస్తున్నాయి. 2020 మే నెలలో పోతిరెడ్డిపాడు విస్తరణకు, రాయలసీమ ఎత్తిపోతలపై అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చిన వారం రోజుల్లోనే కృష్ణా బోర్డుకు లేఖ రాశాం. గత ఏడాది జులై 25న మరోసారి లేఖ పంపాం. ఫిబ్రవరి తర్వాత కేంద్రానికి, బోర్డుకు ఏడు లేఖలు రాశాం. వైఎస్‌ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 4 రెట్లు పెరగడం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అసమర్థత కాదా? మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై వారు 300 కేసులు వేశారు. ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేంద్రం, తెలంగాణ భాజపా నాయకులు ఎందుకు స్పందించడం లేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ రాజకీయ సమాజం ఒక్కటి కావాలి’’ అని ప్రశాంత్‌రెడ్డి కోరారు. కృష్ణా జలాల కోసం రాజీనామాలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని బాలరాజు, జనార్దన్‌రెడ్డిలు తెలిపారు. జగన్‌కు కేసీఆర్‌ స్నేహహస్తం ఇస్తే ఆయన ద్రోహ హస్తం ఇచ్చారని.. జగన్‌ తప్పటడుగులు వేస్తే ఆయనకు చంద్రబాబు గతే పడుతుందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని