బెంగాల్‌లో మండలి ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం

ప్రధానాంశాలు

బెంగాల్‌లో మండలి ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం

పార్లమెంటులో అడ్డుకుంటామన్న భాజపా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో శాసన మండలి (విధాన పరిషత్‌) ఏర్పాటు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. అడహాక్‌ కమిటీ సిఫార్సుల మేరకు మండలి ఏర్పాటుకు తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌ నిర్వహించగా.. శాసనసభకు హాజరైన 265 మంది సభ్యులకు గాను 196 మంది అనుకూలంగాను, 69 మంది వ్యతిరేకంగాను స్పందించారు. కాగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన భాజపా (ప్రతిపక్షం) శాసనసభాపక్షం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)ని విమర్శించింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ నేతలు శాసనకర్తలుగా ఎన్నికయ్యేందుకు గాను టీఎంసీ ‘దొడ్డిదారి రాజకీయాలకు’ పాల్పడుతోందని ధ్వజమెత్తింది. మండలి ఏర్పాటుతో రాష్ట్ర ఖజానాపై భారం (ఏటా రూ. 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు) కూడా పడుతుందని భాజపా నేత సువేందు అధికారి విమర్శించారు. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదించాల్సి ఉంటుందన్నారు. అయితే పార్లమెంటులో భాజపా దీన్ని వ్యతిరేకిస్తుందన్నారు.

మండలి ఏర్పాటైతే..
పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి ఏర్పాటైతే గరిష్ఠంగా 94 మంది సభ్యులు (ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3వ వంతు) ఉండొచ్చు. దేశంలో ప్రస్తుతం బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో శాసనమండళ్లు ఉన్నాయి. ఒకప్పుడు పశ్చిమబెంగాల్‌లోనూ మండలి ఉండేది. 1969లో అప్పటి వామపక్ష సంకీర్ణ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. 2010లో అస్సాం, 2012లో రాజస్థాన్‌ అసెంబ్లీలు కూడా మండలి ఏర్పాటుకు తీర్మానాలు చేశాయి. ఈ బిల్లులు రాజ్యసభలో పెండింగులో ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రంగా ఉన్నంతవరకు (2019) అక్కడా మండలి ఉండేది.


మమత సీఎంగా కొనసాగాలంటే..

సెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటికీ మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ పదవిలో ఆమె కొనసాగాలంటే ఆమె నవంబరులోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అది వీలుకాకపోతే మండలిలోనైనా సభ్యత్వం పొందాలి. అయితే పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలోనే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారంటూ భాజపా విమర్శలు చేస్తోంది. అయితే ప్రతిపక్షం విమర్శలను టీఎంసీ సీనియర్‌ నేత పార్థ ఛటర్జీ తిప్పికొట్టారు. ‘‘మమతకు ‘దొడ్డిదారి’లో వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆమె ఎప్పుడూ రాజమార్గంలోనే వెళతారు’’ అని అన్నారు. పార్లమెంటులో తీర్మానాన్ని భాజపా అడ్డుకునే సాహసం చేస్తే  ప్రజలే తగిన జవాబిస్తారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని