సిద్ధూ.. వద్దే వద్దు

ప్రధానాంశాలు

సిద్ధూ.. వద్దే వద్దు

సోనియాకు అమరీందర్‌ లేఖ
 
 కాంగ్రెస్‌ అధ్యక్షురాలితో సిద్ధూ భేటీ

దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుందంటూ ఊహాగానాలు వినిపిస్తుండటంతో సీఎం అమరీందర్‌ సింగ్‌ బాంబు పేల్చారు! సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ మేరకు లేఖ రాశారు. హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లను, పార్టీని ఎప్పటినుంచో నమ్ముకొని ఉన్నవారిని కాదని సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందులో పేర్కొన్నారు. సిద్ధూ 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందే భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు- సిద్ధూ, అమరీందర్‌ల మధ్య సయోధ్య కుదిర్చే దిశగా కాంగ్రెస్‌ పంజాబ్‌ వ్యవహారాల బాధ్యుడు హరీశ్‌ రావత్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమరీందర్‌తో ఆయన చండీగఢ్‌లో శనివారం భేటీ కానున్నారు.  

సిద్ధూకే అవకాశం?

సోనియా గాంధీతో నవజోత్‌సింగ్‌ సిద్ధూ శుక్రవారం భేటీ అయ్యారు. దిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, హరీశ్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. సిద్ధూకు పీసీసీ పగ్గాలను అప్పగించబోతున్నారన్న ఊహాగానాలకు తాజా భేటీతో మరింత బలం చేకూరినట్లయింది. సమావేశం అనంతరం హరీశ్‌ రావత్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. పంజాబ్‌ కాంగ్రెస్‌ను చక్కదిద్దేలా సోనియా త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, సిద్ధూ కలిసికట్టుగా పనిచేసేలా ఓ ఫార్ములాను అధిష్ఠానం రూపొందిస్తోందన్నారు. సిద్ధూ మాత్రం విలేకర్లతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమరీందర్‌, సిద్ధూ తమకు విధేయులైన ఎమ్మెల్యేలు, మంత్రులతో చండీగఢ్‌లో గురువారం వేర్వేరుగా భేటీ కావడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు- పంజాబ్‌లో హిందువుల జనాభా గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వ్యక్తికే పీసీసీ పగ్గాలివ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ శుక్రవారం డిమాండ్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని