అమృత్‌సర్‌లో సిద్ధూ బలప్రదర్శన
close

ప్రధానాంశాలు

అమృత్‌సర్‌లో సిద్ధూ బలప్రదర్శన

62 మంది ఎమ్మెల్యేలతో పూజలు

అమృత్‌సర్‌: బల ప్రదర్శన జరిగిందా అన్న అభిప్రాయం కలిగేలా పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నివాసం వద్దకు బుధవారం 62 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 80 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో మెజార్టీ సభ్యులు పాల్గొనడం విశేషం. అనంతరం వారంతా లగ్జరీ బస్సుల్లో స్వర్ణమందిరం, దుర్గియానా మందిరం, రాం తీర్థ్‌ స్థల్‌లకు వెళ్లి పూజలు చేశారు. ఇందులో పాల్గొన్నవారిలో మంత్రులు సుఖిజీందర్‌ సింగ్‌ రంధ్వా, తృప్త్‌ రాజీందర్‌ సింగ్‌ బజ్వా, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, సుఖ్‌బీందర్‌ సింగ్‌ సర్కారియా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ ఉన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి రంధ్వా చూసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌-సిద్ధూల మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. సిద్ధూకు ఇంతవరకు అమరీందర్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. తనను విమర్శిస్తూ ట్వీట్లు చేసిన సిద్ధూ బహిరంగంగా క్షమాపణలు చెప్పేవరకు ఆయనను కలవబోనని కూడా ఇదివరకే ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడడానికి ముందు నుంచే సిద్ధూ కాంగ్రెస్‌ ప్రముఖులను కలవడం ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి రాజీందర్‌ కౌర్‌ భట్టాల్‌ ఇంటికి వెళ్లినా, అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్‌ ఇంటికి మాత్రం వెళ్లలేదు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారని తెలిసింది. సిద్ధూ శుక్రవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపడతారని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుల్జీత్‌ సింగ్‌ నగ్రా చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని