జాతీయ రాజకీయాల్లోకి మమతా బెనర్జీ

ప్రధానాంశాలు

జాతీయ రాజకీయాల్లోకి మమతా బెనర్జీ

టీఎంసీ పార్లమెంటరీ పార్టీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం
దిల్లీ పర్యటనకు ఒకరోజు ముందు కీలక పరిణామం

కోల్‌కతా/దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర నిర్వహణకు సిద్ధమయ్యారు. టీఎంసీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఆమెను పార్లమెంటరీ పార్టీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడంతో ఆ దిశగా శుక్రవారం తొలి అడుగుపడింది. ఇంత వరకూ సొంత రాష్ట్ర వ్యవహారాలకే అత్యధిక సమయం కేటాయించిన మమత ఇక తన దృష్టిని దేశ రాజకీయాలపైనా కేంద్రీకరించనున్నారనే విషయం స్పష్టమయ్యింది. శనివారం దిల్లీ పర్యటనకు మమత రానుండగా దానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ఆమె వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ప్రధాని మోదీతో సమావేశ షెడ్యూలు కూడా ఖరారైంది. ‘‘మమతా బెనర్జీ ఏడు దఫాలు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. వరుసగా మూడు సార్లు బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆమెకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆమె ఒక రాష్ట్ర సీఎం మాత్రమే కాదు ఈ దేశ బడుగు వర్గ ప్రజల ఆశాజ్యోతి కూడా. పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఆమె మాకు మార్గనిర్దేశం చేస్తారు’ అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. ప్రస్తుతం మమతా బెనర్జీ పార్లమెంటు సభ్యురాలు కానప్పటికీ టీఎంసీ పీపీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికకు అర్హులే. ఈ పార్టీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో హోరాహోరీ పోరాడి ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ...కేంద్రంలోనూ కమలనాథులకు వ్యతిరేకంగా విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న ప్రయత్నంలో ఉన్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ వివాదం, కొవిడ్‌ నియంత్రణలో ముఖ్యంగా రెండో విడత కరోనా కట్టడిలో వైఫల్యం, పెట్రో ధరల పెరుగుదల తదితర అంశాలు ఇందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకొని భాజపాయేతర పక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని మమతా బెనర్జీ ఇటీవల పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా టీఎంసీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని