మోదీ, షాలది దేశద్రోహం

ప్రధానాంశాలు

మోదీ, షాలది దేశద్రోహం

నా ఫోన్లన్నీ ట్యాప్‌ చేశారు : రాహుల్‌గాంధీ

దిల్లీ: పెగాసస్‌ కలకలంపై కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారతీయ సంస్థలు, ప్రజాస్వామ్యంపై ఈ స్పైవేర్‌ను ఉపయోగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. తాజా హ్యాకింగ్‌ కలకలంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని, అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తాను వినియోగించే ప్రతి ఫోన్‌ను కేంద్రం ట్యాప్‌ చేస్తోందని ఆరోపించారు. ఆయన ఆరోపణలను భాజపా ఖండించింది. దేశంలో ఏ ఒక్కరిపైనా అక్రమంగా నిఘా పెట్టలేదని స్పష్టం చేసింది. ట్యాపింగ్‌ జరిగిందో లేదో తేల్చేందుకు ఫోన్‌ అప్పగిస్తారా అంటూ రాహుల్‌కు సవాలు విసిరింది.  పార్లమెంటు సమీపంలోని విజయ్‌చౌక్‌ వద్ద మీడియాతో రాహుల్‌ శుక్రవారం మాట్లాడారు. ‘‘పెగాసస్‌ను ఇజ్రాయెల్‌ ఓ ఆయుధంగా వర్గీకరించింది. దాన్ని ఉగ్రవాదులపైనే ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ మన ప్రధానమంత్రి, హోంమంత్రి.. భారతదేశం, దాని సంస్థలకు వ్యతిరేకంగా వినియోగించారు. కర్ణాటకలో ప్రభుత్వ కూల్చివేతకు ఉపయోగించుకున్నారు. ఇదంతా దేశద్రోహమే’’ అని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా, రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై దర్యాప్తును తప్పించుకునేందుకు పెగాసస్‌ను కేంద్రం ఉపయోగించిందని రాహుల్‌ ఆరోపించారు. ‘‘హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ప్రధానిపై సుప్రీంకోర్టు జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి. ఎందుకంటే పెగాసస్‌ వినియోగానికి ప్రధాని/ హోం మంత్రి మాత్రమే ఆదేశాలివ్వగలరు’’ అని అన్నారు. తనతో పాటు తన స్నేహితుల ఫోన్లనూ ట్యాప్‌ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన కొందరు తనకు గతంలోనే సమాచారమిచ్చారని చెప్పారు. ‘‘నా ఫోన్‌ ట్యాప్‌ చేసే ఐబీ అధికారులు కొందరు నాకు కాల్‌ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక నేను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నానో.. ప్రతిదాన్నీ నా భద్రత సిబ్బంది వారి సీనియర్లకు నివేదించేవారు. ఈ విషయాన్ని భద్రత సిబ్బందే చెప్పారు’’ అని పేర్కొన్నారు. తాజా హ్యాకింగ్‌ తన గోప్యతకు మాత్రమే సంబంధించిన విషయం కాదని రాహుల్‌ అన్నారు. ప్రజావాణిపై దాడిగా దాన్ని అభివర్ణించారు.

అనవసర రాద్ధాంతం : భాజపా
పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసేందుకే పెగాసస్‌పై కాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని భాజపా విమర్శించింది. భాజపా అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాఠోడ్‌ దిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని రాహుల్‌ భావిస్తే.. దాన్ని ఏదైనా దర్యాప్తు సంస్థకు సమర్పించాలి. వాస్తవమేంటో తేలిపోతుంది. వాస్తవాలేవీ ఉండని ఆయన ఫోన్‌లోని వివరాలను తెలుసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపబోరు’’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని