రుణాంధ్ర.. దివాళాంధ్ర ప్రదేశ్‌గా మార్చొద్దు

ప్రధానాంశాలు

రుణాంధ్ర.. దివాళాంధ్ర ప్రదేశ్‌గా మార్చొద్దు

 సీఎంకు ఎంపీ రఘురామ విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేయండి. ఇష్టారీతిన అప్పులు చేసి రుణాంధ్ర.. దివాళాంధ్ర ప్రదేశ్‌గా చేయొద్దని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆర్థిక బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం మన రాష్ట్రం ఈ ఏడాదికి రూ.42 వేల కోట్ల వరకు అప్పులు చేయొచ్చు. ఇటీవల తెరచాటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్ల అప్పులు చేసిన విషయాన్ని ఆర్థిక క్రమశిక్షణ కోరుకునే కొందరు బయటకు తెచ్చారు. దీంతో రూ.42 వేల కోట్లలో ఆ రూ.17 వేల కోట్లను మినహాయించి సవరించిన పరిమితిని కేంద్రం నిర్దేశించింది. దీనిని పలు దఫాలుగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఎపీఎస్డీసీ) పేరుతో ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటోంది. గత పార్లమెంటు సమావేశాల్లో దీనిపై నేను మాట్లాడా.  రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అప్పు చేస్తే ఆ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుంది. దానిని తెలియజేయకుండా తెరచాటుగా చేస్తున్నారు. మేం తెరచాటుగా చేయలేదు. గ్యారంటీ ఇవ్వలేదని కొందరు పెద్దలు అనడం తప్పు. ఏ రకంగా ఇచ్చినా గ్యారంటీ గ్యారంటీనే.  కేంద్ర ప్రభుత్వ నిర్దేశ సూత్రాలను ఉల్లంఘించి ఇలా అప్పు చేయడం తగదు. నిబంధనలు అన్నీ చెబితే అప్పులకు ముఖ్యమంత్రి ఒప్పుకుంటారని నేను అనుకోను. నేను ఖండించేది ఆయన అనుచరగణాన్ని. తెలివిగలవాడైన తమ ముఖ్యమంత్రి ఇంత మంది సలహాదారులను ఎందుకో పెట్టుకున్నారు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలకు ఏపీఎస్డీసీ నిధులు ఎలా వాడతారు? మా ప్రభుత్వం రూ.25 వేల కోట్లకు ఇటీవల ఏదో రకంగా గ్యారంటీ ఇచ్చింది. బ్యాంకర్లు ఎలా అప్పులు ఇస్తున్నారనేది ప్రధాన సమస్య. ఈ అంశంపై నేను కాగ్‌ ఆడిట్‌ డిమాండ్‌ చేస్తున్నా. కార్పొరేషన్లు స్థాపించి వినూత్న విధానంలో అప్పులు చేసి లెక్కలను తప్పుదోవ పట్టించే విధంగా ఏ విధంగా చేస్తున్నారనే దానిపై నేను ప్రధానమంత్రికి లేఖ రాశా. అప్పుల విషయం బయటకు వచ్చి రూ.42 వేల కోట్లలో రూ.17 వేల కోట్లను తీసివేసినట్లే ఈ రూ.25 వేల కోట్లను తీసివేస్తే జీతాలకూ గడగడలాడే పరిస్థితి ఎదుర్కొబోతున్నాం.  మా రాష్ట్రం దివాళా తీయకుండా చూడాలని ప్రధానమంత్రిని లేఖలో కోరా. మనం గతంలో తీసుకున్న వాటికి తిరిగి చెల్లించే సమయం వస్తోంది.  రేపు మీ మనసు మారి మద్యనిషేధం విధిస్తే గ్యారంటీ వెంటనే అమల్లోకి వస్తుంది. అప్పుల విషయంలో పునరాలోచించాలి. ఇతర దేశాల్లాగా అప్పులు చేస్తాం. భారతదేశ చట్టాలపై గౌరవం లేదు మా ముఖ్యమంత్రి ఇష్టానుసారం అప్పులు చేస్తామనే వారికి శిక్షలు పడతాయి. రాబోయే 14 ఏళ్ల పాటు డిపోల ఆదాయాన్ని తాకట్టు పెట్టి దానిని ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా చేశారు. మరో రెండు పర్యాయాలు ఉన్న డిపోలను కూడా తాకట్టు పెట్టి మరో రూ.50 వేల కోట్లకు అప్పులు చేయాలనే ఆలోచన సలహాదారులకు వచ్చిందని తెలిసింది. ఆ ఆలోచన ముఖ్యమంత్రికి చెప్పారో లేదో తెలియదు. రాష్ట్రంలోని ఆసుపత్రులన్నింటినీ తాకట్టు పెట్టి వాటిని ఏపీ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు దఖలు పర్చి రూ.8,500 కోట్ల రుణం తీసుకోవాలని భావిస్తున్నారు...’’ అని రఘురామ పేర్కొన్నారు.

* జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిగా మీరు ప్రైవేటుగా ఎత్తైన గోడలతో ఇల్లు కట్టుకున్నారు. మీ చుట్టుపక్కల 317 మంది ఇల్లు కూల్చివేశారు. వాళ్లకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించండి. వాళ్ల ఉసురు పోసుకోవద్దు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని