తెరాసలో చేరతా: పెద్దిరెడ్డి

ప్రధానాంశాలు

తెరాసలో చేరతా: పెద్దిరెడ్డి

హుజూరాబాద్‌లో ఆ పార్టీ విజయానికి కృషి చేస్తానని వెల్లడి
భాజపాకు మాజీ మంత్రి రాజీనామా

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సోమవారం భాజపాకు రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీలో కొనసాగడానికి తన మనసు అంగీకరించడం లేదని వివరించారు. రెండేళ్లుగా సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు ఆ పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన తెరాస నేత ఈటల రాజేందర్‌ భాజపాలో చేరడంతో అదే నియోజకవర్గం నుంచి పనిచేయాలనుకున్న పెద్దిరెడ్డి తనకిక అక్కడ పోటీకి అవకాశం రాదని భావించి భాజపాను వీడినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెదేపా ప్రాభవం కోల్పోవడంతో భాజపాలో చేరారు. కానీ ఈటల సైతం ఆ పార్టీలో చేరడంతో పార్టీని వీడారు. త్వరలోనే తెరాసలో చేరతానని ‘ఈనాడు’కు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ఏ తేదీన చేరతాననేది మంగళవారం వెల్లడిస్తానని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది తెలియదని, అభ్యర్థి ఎవరైనా గెలిపించేందుకు చొరవ చూపిస్తానని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసేందుకే తెరాసలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు.

మరికొందరు నేతలు?
కొంతకాలం క్రితం ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరినవారిలో కొందరు నేతలు ఇప్పుడు ఆ పార్టీని వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డి మాదిరిగానే మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ సైతం గతంలో తెదేపా నుంచి భాజపాలో చేరారు. మోత్కుపల్లి ఇటీవలే భాజపాకు రాజీనామా చేశారు. ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్ర శేఖర్‌ ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలసి ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాక కొండా తిరిగి అదే పార్టీలో కొనసాగడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మాజీమంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ సైతం భాజపాలో సరైన గుర్తింపు లేదనే అసంతృప్తిలో ఉన్నారని రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని