ప్రతిపక్షాల తీరును ఎండగట్టండి

ప్రధానాంశాలు

ప్రతిపక్షాల తీరును ఎండగట్టండి

ప్రతి గ్రామంలో 75వ స్వాతంత్య్ర సంబరాలు జరపండి
భాజపా ఎంపీలకు ప్రధాని నరేంద్రమోదీ నిర్దేశం

దిల్లీ: పార్లమెంటులో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు సభలను సజావుగా సాగనివ్వడం లేదన్న విషయాన్ని ఎండగట్టాలని భాజపా ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ 75వ స్వాతంత్య్ర సంబరాల సందర్భంగా సభ్యులంతా తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ కార్యక్రమాలను చేపట్టాలని నిర్దేశించారు. ప్రజా భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ ఇద్దరు చొప్పున కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాలు ప్రతి సెగ్మెంట్‌లోనూ 75 గంటలు గడపాలని... 75 గ్రామాలను సందర్శించాలని సూచించారు. స్థానికంగా క్రీడలు, స్వచ్ఛత కార్యక్రమాలు వంటివాటిని నిర్వహిస్తూ సంబరాలు జరపాలన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో.. ప్రజల నుంచి సూచనలు, సలహాలు, ఆలోచనలను కోరాలని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామీణ భారతంలో ప్రజలంతా డిజిటల్‌ అక్షరాస్యతను సాధించాలని.. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వారు గరిష్ఠంగా పొందగలుగుతారని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరేలా ఎంపీలంతా కృషి చేయాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వివరాలను విలేకరులకు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని