ఉపఎన్నిక ముగిసే వరకు ‘దళితబంధు’ నిలిపేయాలి

ప్రధానాంశాలు

ఉపఎన్నిక ముగిసే వరకు ‘దళితబంధు’ నిలిపేయాలి

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎఫ్‌జీజీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ముగిసేంత వరకు దళితబంధు పథకం, ఇతర కార్యక్రమాల అమలును నిలిపివేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) విజ్ఞప్తి చేసింది. ఈ పథకాన్ని ఎఫ్‌జీజీ స్వాగతిస్తోందని, అయితే ప్రస్తుతం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో అమలుచేయాలని కోరింది. ఈ మేరకు ఫోరం కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళితబంధును అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసి, కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.1,190 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలుచేసి, ఆ తరువాత రాష్ట్రమంతా విస్తరిస్తామని సీఎం చెప్పారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దళితబంధును హుజూరాబాద్‌ నియోజకవర్గానికి పరిమితం చేశారంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వచ్చే నెలలో కేవలం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల నగదు బదిలీ చేయబోతున్నారు’’ అని ఆ లేఖలో పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని