‘పనుల’ను అడ్డుకోవడం వారికి అలవాటే

ప్రధానాంశాలు

‘పనుల’ను అడ్డుకోవడం వారికి అలవాటే

కోమటిరెడ్డి సోదరులపై మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ

మునుగోడు, చండూరు, న్యూస్‌టుడే:  ప్రభుత్వ అభివృద్ధి పనులను అడ్డుకోవటం కోమటిరెడ్డి సోదరులకు అలవాటుగా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘వారు వైఎస్‌ మొదలుకొని షర్మిల వరకు ఆంధ్రోళ్లకు బానిసలుగా బతుకుతున్నారు. కృష్ణా జలాల వాటాను అమ్ముకుని రైతుల ఉసురు తీసుకున్నారు’ అంటూ  నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లా మునుగోడులో బుధవారం నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏడేళ్ల నుంచి తాను ఎవరి వ్యక్తిగత జీవితాలు, రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. అనవసరంగా తన జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారి నేతలనే తరిమికొట్టిన చరిత్ర తమదని.. భయపడటానికి తాను ఉత్తమ్‌ని, జానారెడ్డిని కాదన్నారు. రాజగోపాల్‌రెడ్డి పది వేల మందితో తనను అడ్డుకుంటానన్నారని.. కనీసం పది మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తన పీఠం కదులుతోందనే భయంతోనే ప్రొటోకాల్‌ పేరుతో గొడవకు దిగారన్నారు. పులులమని చెప్పుకొంటూ తిరిగేవారిని త్వరలోనే అడవులకు పంపుతామన్నారు. మునుగోడులో అన్ని రైతు వేదికలను తానే ప్రారంభిస్తానని మంత్రి స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని