పీవీ తర్వాత అంతటి వ్యక్తి జైపాల్‌రెడ్డి

ప్రధానాంశాలు

పీవీ తర్వాత అంతటి వ్యక్తి జైపాల్‌రెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌

జైపాల్‌రెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా నివాళి

న్యూస్‌టుడే యంత్రాంగం; ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పీవీ నర్సింహారావు తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మాత్రమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన సోనియా గాంధీని ఒప్పించి, దాన్ని సాకారం చేశారని కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్‌ వద్ద ఆయన రెండో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జైపాల్‌రెడ్డి సమాధి వద్ద రేవంత్‌రెడ్డి నివాళి అర్పించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, హైదరాబాద్‌లో మెట్రో రైలు రావడానికి జైపాల్‌రెడ్డి కృషే కారణమని వివరించారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణలో ఆచరించి అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు నేతలు జైపాల్‌రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా బుధవారం గాంధీభవన్‌లో వారి చిత్రపటాలకు కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వేధింపులు ఆపకపోతే బుద్ధి చెప్తాం

కాంగ్రెస్‌ శ్రేణులపై వేధింపులు ఆపకపోతే తగిన బుద్ధి చెప్తామని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి  బుధవారం ఒక ప్రకటనలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని హెచ్చరించారు. ఎమ్మెల్యే  రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని ఖండిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.

డీజీపీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

కాంగ్రెస్‌ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ను వ్యతిరేకిస్తూ పీసీసీ చేపట్టిన చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో తమ శ్రేణులను అరెస్టు చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు బుధవారం డీజీపీని కలిసి వినతి చేశారు.

‘రహస్య అజెండాతో కేసీఆర్‌, జగన్‌’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు రహస్య అజెండాతో పని చేస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి దిల్లీలో విమర్శించారు. తమ పార్టీల ప్రయోజనాల కోసం ఆ ఇద్దరూ ప్రజల భావోద్వేగాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని రవి డిమాండ్‌ చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని