రూ.10 లక్షలు కాదు.. రూ.50 లక్షలివ్వాలి

ప్రధానాంశాలు

రూ.10 లక్షలు కాదు.. రూ.50 లక్షలివ్వాలి

దళితులను మోసం చేస్తున్న సీఎం
వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై ఆయనకు చిత్తశుద్ధి లేదు
‘బడుగుల ఆత్మగౌరవ పోరు సభ’లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు

కవాడిగూడ, న్యూస్‌టుడే:  దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయా వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం కాదని, ఇప్పటివరకు సీఎం వారికి చేసిన వాగ్దానాల ప్రకారం రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ‘‘దళితులకు ఇచ్చే పది లక్షల రూపాయలతో ఎకరం భూమి కూడా రాదు. గతంలో సీఎం హామీ ఇచ్చిన మేరకు మూడెకరాలకు రూ.30 లక్షలు, రెండు పడకగదుల ఇంటికి రూ.10 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు మరో రూ.10 లక్షలు... ఈ లెక్కన ప్రతి దళిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి’ అని వివరించారు. భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద శుక్రవారం ‘బడుగుల ఆత్మగౌరవ పోరు’ సభ నిర్వహించారు. సంజయ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నియోజకవర్గంలోని దళితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తానంటూ దళితబంధు ప్రకటించారని దుయ్యబట్టారు. దళితులకు ఇచ్చే ఆ డబ్బులతో ఎకరం భూమి కూడా రాదన్నారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పది వేల మంది డప్పు కళాకారులతో త్వరలోనే ప్రగతి భవన్‌ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ గోడలు బద్దలు కొట్టి అక్కడ 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌ ఫాంహౌస్‌ను లక్ష నాగళ్లతో దున్ని బడుగులకు పంచుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోడుభూముల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పారని, పంట చేతికి వచ్చే సమయంలో ఆ భూముల్లోకి అధికారుల్ని పంపించి పంటల్ని నాశనం చేయిస్తున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం భారీ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో దళితులు, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ఎంపీ బాపూరావు మాట్లాడారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రులు చంద్రశేఖర్‌, విజయరామారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌ మాట్లాడారు. శాసనసభ్యులు రాజాసింగ్‌, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

* కేంద్ర మంత్రివర్గంలో దళితులు, బీసీలకు భారీగా చోటు కల్పించినందుకు అశోక్‌నగర్‌లో ప్రధాని మోదీ చిత్రపటానికి లక్ష్మణ్‌, సంజయ్‌లు క్షీరాభిషేకం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని