అవినీతి అధికారులపై న్యాయ పోరాటం

ప్రధానాంశాలు

అవినీతి అధికారులపై న్యాయ పోరాటం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: అవినీతి అధికారులపై చట్టపరంగా న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు పదవీ విరమణ చేసి కీలక పదవుల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులు ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాస్తున్నారని, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించింది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక, అభ్యర్థి ఎంపికపై ఆగస్టు 4న ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం రాత్రి ఇందిరాభవన్‌లో పీసీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఐఏఎస్‌ అధికారులు, విశ్రాంత అధికారులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, ఆయా అధికారులపై కేంద్రంలోని సంబంధిత డిపార్టుమెంట్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు అడ్డగోలుగా పెంచి అవినీతికి పాల్పడ్డారని.. దీనిపై మరోసారి సమావేశమై కార్యాచరణ దిశగా తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒప్పంద స్టాఫ్‌ నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఏకపక్ష నిర్ణయాలు వద్దు!
పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని పలువురు నాయకులు.. రేవంత్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది. పీసీసీ స్థాయిలో కార్యక్రమాలకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు వద్దని చెప్పినట్లు సమాచారం. కోకాపేట భూముల అవినీతిపై నిర్దిష్ట కార్యాచరణ తీసుకోకపోవడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో అవినీతిపై స్పందించకపోవడం వంటి విషయాలపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఇంద్రవెల్లి సభను ఏకపక్షంగా ప్రకటించారని మహేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఈ విషయంలో రేవంత్‌తో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని