దళితబంధును ఎవరూ ఆపడం లేదు

ప్రధానాంశాలు

దళితబంధును ఎవరూ ఆపడం లేదు

అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌
తెరాస నాయకుల గుండెల్లో డప్పు మోగించాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దళితబంధు పథకాన్ని ఎవరూ ఆపడం లేదని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరునూరైనా దళితబంధు ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. ‘దళిత, గిరిజనుల కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ప్రగతిభవన్‌ అమ్ముతారా? సచివాలయం అమ్ముతారా? చెప్పండి.. కాంగ్రెస్‌ మద్దతిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌ ఇందిరాభవన్‌లో శనివారం జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో దండు కడుతున్నాం.. దండోరా వేస్తున్నామని చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయిలో లక్ష మందితో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తెరాస నాయకుల గుండెల్లో డప్పు మోగించాలని శ్రేణులకు సూచించారు. కుటుంబానికి రూ.పది లక్షలు ఇవ్వాలని నినదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులను ప్రభుత్వం మోసం చేస్తోందని రేవంత్‌ అన్నారు. తమ భూములు తమకు కావాలని అడిగితే చెట్లకు కట్టేసి కొట్టారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన భూములను కేసీఆర్‌ సర్కార్‌ హరితహారం, కాలువలు, జలాశయాల పేరుతో గుంజుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులు సాధించుకుంటామని పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లా వరకు పోడు భూములపై పోరాటానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’గా పేరు నిర్ణయించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఈ సభ నిర్వహణకు ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీ నియమించినట్లు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని