కాంగ్రెస్‌కు సవాల్‌గా హుజూరాబాద్‌

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌కు సవాల్‌గా హుజూరాబాద్‌

ఇప్పటికే పార్టీని వీడిన ముఖ్యనేతలు
అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన
రేపు గాంధీభవన్‌లో కీలక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి సహా మండల నాయకులు, ఇతర ముఖ్య నాయకులు అంతా తెరాస, భాజపాలోకి చేరిపోవడం పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది. తెరాస, భాజపాలు పోటాపోటీ వ్యూహాలతో ఉప ఎన్నిక దిశగా ముందుకు వెళ్తుండగా కాంగ్రెస్‌ క్షేత్ర స్థాయిలో నాయకత్వ నిర్మాణంపై దృష్టి సారిస్తోంది.
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌ఛార్జిగా నియమితులైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌ రాజనర్సింహా ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటించి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. మండల స్థాయి బాధ్యులుగా నియమితులైన పార్టీ ముఖ్యనాయకులు ఒకసారి నియోజకవర్గంలో పర్యటించారు. తాజాగా నియోజకవర్గంలో నాయకత్వ పునర్‌నిర్మాణమే లక్ష్యమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతో పాటు పార్టీ నాయకత్వం ఎక్కడా ఉదాసీనత చూపకుండా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టిసారించే లక్ష్యంతో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పార్టీ ముఖ్యనేతలు, కరీంనగర్‌ జిల్లా ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ముందకు వెళ్లే కార్యాచరణపై సమగ్రంగా చర్చించనున్నారు.

బరిలోకి ఎవరిని దింపుదాం?

కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తయారైంది. నియోజకవర్గంలో మిగిలిన నేతల్లో ఒకరిని బరిలో దింపాలా? లేదా పూర్వపు కరీంనగర్‌ జిల్లా పరిధిలోని ముఖ్యనాయకుల్లో ఒకర్ని అభ్యర్థిగా దింపాలా? అనే విషయమై పార్టీ తర్జనభర్జన పడుతోంది. అభ్యర్థిని ఇప్పటికిప్పుడు ప్రకటించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు. స్థానికం, సామాజిక వర్గాల సమీకరణలు, తెరాస అభ్యర్థి ఎవరవుతారు? తదితర అంశాలపై అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉండనుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

1983 నుంచి ఒక్కసారీ గెలవని కాంగ్రెస్‌

1983 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి 11 ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ ఒక్కసారీ నెగ్గలేదు. 2009లో మాత్రం ప్రత్యర్థి ఆధిక్యాన్ని 14వేల ఓట్లకు పరిమితం చేసింది. అంతకుముందు తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి, నెగ్గిన పార్టీ అభ్యర్థికి మధ్య 20 వేలకు పైగా ఓట్ల తేడా ఉంది. 2009 నుంచి వరుసగా జరిగిన నాలుగు ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నెగ్గారు. గత ఎన్నికల్లో ఈటల 43 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యతతో నెగ్గగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని