ఎన్నికలు రాగానే నాటకాలు

ప్రధానాంశాలు

ఎన్నికలు రాగానే నాటకాలు

భాజపా నాయకులపై మంత్రి హరీశ్‌రావు విమర్శ

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: ఎన్నికలు రాగానే భాజపా నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. ప్రచారంలో గాయపడినట్లు, అనారోగ్యం పాలైనట్లు ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరుగుతూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇది ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ అని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ చక్రాల కుర్చీలో ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని, దీనిపై ప్రజలు సానుభూతి చూపవద్దని ఆయన కోరారు. సిద్దిపేటలో సోమవారం హుజూరాబాద్‌ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ఉద్యోగాలను ఊడగొడుతున్న పార్టీ భాజపా అని.. తెరాస మాత్రం రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఏడేళ్లలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, త్వరలో 50 నుంచి 70 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన భాజపా.. బీసీల సంక్షేమానికి శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో పార్టీ కేడర్‌ మొత్తం కేసీఆర్‌ వెంటే ఉందన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని