నిరుద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే: షర్మిల

ప్రధానాంశాలు

నిరుద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే: షర్మిల

కోనరావుపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని నిరుద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధినాయకురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లిలో మంగళవారం ఆమె నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముచ్చర్ల మహేందర్‌యాదవ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆమె దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం మహేందర్‌ తల్లి రామవ్వ నిమ్మరసం అందజేసి దీక్ష విరమింపజేశారు. షర్మిల మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల చేతిలో బందీ అయింది. పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా వారి కుటుంబాలను ఓదార్చేందుకు తండ్రీకొడుకులకు సమయం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలి’’ అని డిమాండు చేశారు. నేతన్నల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతున్న మంత్రి కేటీఆర్‌ బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి రూ.100 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని