భాజపా, తెరాసల మధ్య రహస్య బంధం

ప్రధానాంశాలు

భాజపా, తెరాసల మధ్య రహస్య బంధం

ప్రధానితో తెరాస రాజ్యసభ సభ్యుల భేటీ ఎందుకు..?
ప్రగతిభవన్‌ నజరానాయే రాయలసీమకు జీవో  
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: భాజపా-తెరాసల రహస్య బంధం బయటపెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీతో కలిసి మంగళవారం దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు జులై 19న ప్రధాని మోదీని తెరాస రాజ్యసభ సభ్యులు కలిశారన్నారు. ప్రజా సమస్యలపై కలిస్తే ఆ విషయాన్ని బయటపెట్టి ఉండొచ్చన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో దిల్లీపై యుద్ధమే అని ప్రకటించిన కేసీఆర్‌ తర్వాత మోదీ, అమిత్‌ షాల ముందు మోకరిల్లారని విమర్శించారు. పెగాసస్‌పై విపక్షాలు ఆందోళన చేస్తుంటే తెరాస సభ్యులు ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపు, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 14 విపక్షాలు మంగళవారం సమావేశమైతే తెరాస ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా నిలవకుండా చేసేందుకే భాజపా-తెరాస యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నాయని మండిపడ్డారు. ఆగస్టు 9న ప్రారంభించాల్సిన పాదయాత్రను కేసీఆర్‌ ఒత్తిడితోనే బండి సంజయ్‌ వాయిదా వేసుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. మోదీ కేసీఆర్‌లు కవల పిల్లలని, భాజపాకు తెరాస అనుబంధ సంస్థ వంటిదన్నారు. 64 కళల్లో ఏదోఒక కళలో నైపుణ్యం ఉన్నవారిని మండలికి పంపుతారని, కోవర్టు అనే 65వ కళలో ప్రవీణుడైన కౌశిక్‌రెడ్డిని కేసీఆర్‌ మండలికి పంపారని ఎద్దేవా చేశారు.

కృష్ణా జలాల తరలింపునకు పోతిరెడ్డిపాడు, రాయలసీమ విస్తరణ పనులు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనను ప్రగతిభవన్‌కు ఆహ్వానించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు అవసరమైన జీవో నెం: 203ను తయారుచేసి నజరానాగా ఇచ్చారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకోవాల్సిన సమయాల్లో బోర్డు సమావేశాలకు కేసీఆర్‌ గైర్హాజరయ్యారని, నాడు ఏం పట్టనట్లు వ్యవహరించి ఇప్పుడు ఆంధ్రా దాదాగిరి చేస్తోందని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో కేసీఆర్‌ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా, పాలమూరును పాలమూరు-రంగారెడ్డిగా మార్చి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా ఒక్క ఎకరానికీ అదనంగా నీళ్లు ఇవ్వలేదన్నారు. గోదావరి నీళ్లను పాలేరుకు ఎత్తిపోసి అక్కడి నుంచి పెద్దదేవరపల్లి దగ్గర పోస్తానంటూ కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిపోత పేరుతో రూ.2లక్షలకోట్ల టెండర్లు పిలిచేందుకు పన్నాగం పన్నుతున్నట్లు ఉందన్నారు.

తెలంగాణ రాబందుల సమితి: యాస్కీ
త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించే గొంతులను నొక్కే యత్నాలు జరుగుతున్నాయని మధుయాస్కీ విమర్శించారు. నిరుద్యోగంతో 3 నెలల్లో 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన చెందారు. తెరాస తెలంగాణ రాబందుల సమితిగా మారిందన్నారు.


పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు పని విభజన

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులకు పనివిభజన చేస్తూ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. గీతారెడ్డికి సికింద్రాబాద్‌, నల్గొండ, హైదరాబాద్‌ నియోజకవర్గాలతోపాటు ఎన్‌ఎస్‌యూఐ, మేధావుల విభాగం, పరిశోధన విభాగాలను అప్పగించారు. అంజన్‌కుమార్‌కు నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మెదక్‌, పెద్దపల్లితో పాటు యువజన కాంగ్రెస్‌, మైనార్టీ, మత్స్యకార విభాగాలు..అజారుద్దీన్‌కు ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరితో పాటు సోషల్‌ మీడియా బాధ్యతలు ఇచ్చారు. జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌లతో పాటు మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, లేబర్‌సెల్‌.. మహేష్‌కుమార్‌ గౌడ్‌కి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్లతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలు, సేవాదళ్‌ బాధ్యతలు అప్పగించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని