అతి పెద్ద కుటుంబం మనది

ప్రధానాంశాలు

అతి పెద్ద కుటుంబం మనది

మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం
ఏ సమస్య వచ్చినా పార్టీకి చెప్పండి
కార్యకర్తలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  
60 లక్షల మందికి ప్రమాద బీమా
యునైటెడ్‌ ఇండియాకు రూ.18.39 కోట్ల ప్రీమియం చెక్కు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ‘‘అంకితభావంతో పనిచేసే కార్యకర్తల వల్లే తెరాస తెలంగాణను సాధించింది. 60 లక్షల మందితో అతిపెద్ద కుటుంబం మనది. అందరినీ ఆదుకుంటాం. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా.. ప్రధాన కార్యదర్శులకు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు చెప్పాలి. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. అనుకోని పరిస్థితుల్లో మీ ఇంట్లో వాళ్లు మీకు దూరమైనా ఎవరూ అధైర్య పడొద్దు. కుటుంబ పెద్దగా కేసీఆర్‌ వెన్నుదన్నుగా ఉంటారు. తెరాస మీకు అండగా ఉంటుంది. మనమందరం నిబ్బరంగా, ధైర్యంగా ముందుకెళ్దాం’’ అని అన్నారు.  గత మూడు నెలల వ్యవధిలో వివిధ ప్రమాదాల్లో 80 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు దుర్మరణం చెందగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున బీమా సాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. గత ఏడాది రాష్ట్రంలో 950 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారని, బాధిత కుటుంబాల బాగోగులు చూసుకునే బాధ్యత తమదని కేటీఆర్‌ అన్నారు. 2021-22 సంవత్సరానికి గాను 60 లక్షల మంది తెరాస కార్యకర్తలకు రూ.18.39 కోట్ల బీమా ప్రీమియం చెక్కును యునైటెడ్‌ ఇండియా బీమా కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. బాధితులతో సహపంక్తి భోజనం చేశారు.  ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.

మంత్రికి వినతులు

తమకు ఇళ్లు లేవని కొందరు.. తమ పిల్లలకు గురుకులాల్లో  ప్రవేశాలు కల్పించాలని మరికొందరు.. చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు తమకేదైనా ఉద్యోగం ఇప్పించాలని ఇంకొందరు మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. ఆయన వెంటనే స్పందించారు. భోజనాల అనంతరం జరిగిన సమావేశంలో తనతో మాట్లాడిన 80 కుటుంబాల సమస్యలను పది రోజుల్లోనే పరిష్కరిస్తామని తెలిపారు. వారిని ఆయా ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు కలిసి తగిన చొరవ చూపాలని సూచించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రధాన కార్యదర్శులు బోడకుంటి వెంకటేశ్వర్లు, బండి రమేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఫరీదుద్దీన్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నారదాసు లక్ష్మణరావు, సుధీర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని