కాంగ్రెస్‌, భాజపా మధ్య చీకటి ఒప్పందం

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌, భాజపా మధ్య చీకటి ఒప్పందం

దళితుల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా కుమ్మక్కు: హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హుజూరాబాద్‌కు చెందిన పలువురు భాజపా, కాంగ్రెస్‌ యువ నాయకులు సిద్దిపేటలో గురువారం ఆయన సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెరాసను దెబ్బకొట్టేందుకు, పరిస్థితులను భాజపాకు అనుకూలంగా మార్చేందుకు తమ పార్టీ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌  యత్నిస్తోందన్నారు. దళితబంధు అమలుతో దళితులంతా తెరాస వైపే ఉండటాన్ని రెండు పార్టీల నేతలు జీర్ణించుకోలేక కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ చిత్రం చూడగానే పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశంతో ఈటల రాజేందర్‌ ప్రచార శైలి మార్చారని హరీశ్‌రావు తెలిపారు. ఆయన మోదీ వద్దకు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్ల ప్యాకేజీ తీసుకురాగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని.. తెరాస గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆత్మగౌరవం పేరుతో ఈటల గడియారాలు, కుక్కర్లు, కుట్టుమిషన్లు, వెండి కుంకుమ భరిణలు, యువతకు సెల్‌ఫోన్లు పంచడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన వారిలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, చిన్నకోమటిపల్లి, బోగంపల్లి గ్రామాల సర్పంచులు సరోజన, తిరుపతిరెడ్డి, చిన్నపాపాయపల్లిలో భాజపాకు చెందిన వార్డు సభ్యులు సునీల్‌, శ్రీనివాస్‌, తిరుపతి, యువమోర్చా నాయకులు ప్రవీణ్‌, చందర్‌, దేవరాజు తదితరులు ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని