ప్రశ్నార్థకంగా సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు

ప్రధానాంశాలు

ప్రశ్నార్థకంగా సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు

 తెరాస ఏడేళ్ల పాలనలో ఎందుకు పూర్తి చేయలేదు?

రాజకీయ లబ్ధి కోసమే ప్రాంతీయ విద్వేషాలు

 పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కుత్బుల్లాపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో నీటి పారుదల ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ శివారు కొంపల్లిలో ఆదివారం జరిగిన బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపించి.. కల్వకుర్తి నుంచి శ్రీరాంసాగర్‌ వరకు ఏడేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఏపీ ముఖ్య మంత్రి జగన్‌కు తెలంగాణపై ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది కాదన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులను కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. కేసీఆర్‌ కృష్ణా బోర్డు సమావేశానికి ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్‌ జల దొంగ అయితే.. బోర్డు సమావేశానికి కేసీఆర్‌ వెళ్లి పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, రాయలసీమ ఎత్తిపోతలపై నిలదీయాలన్నారు. తెరాస ఓటమి ఖరారైనందునే కేసీఆర్‌ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబును తిట్టే పనేముంది?

తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే తాను తెదేపాను వీడానని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డలు, రైతాంగం కన్నీళ్లలో మునిగి తేలుతున్న పరిస్థితులను చంద్రబాబుకు వివరించి... గౌరవంగా పార్టీని వీడినట్లు చెప్పారు. సొంత లాభం పొందాలనుకుంటే అధికార పార్టీలో కాకుండా ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో ఎందుకు చేరుతానన్నారు? హైటెక్‌ సిటీ అభివృద్ధిని వివరిస్తూ చంద్రబాబును పోటీ పడి పొగిడింది మీరేగా.. ఇప్పుడు ఆయన్ను తిట్టాల్సిన అవసరం ఏముందని కేసీఆర్‌ను ప్రశ్నించారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్నారు. రాజకీయ విలువలను గౌరవించే తాను చంద్రబాబును తిట్టలేనని, అందుకే తనను బాబు మనిషి అంటున్నారన్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని రాజశేఖర్‌రెడ్డిని తిట్టిన మీరే జగన్‌తో సఖ్యతగా ఉంటున్నది నిజం కాదా? అన్నారు. తెలంగాణతో సంబంధం లేని చంద్రబాబును తిట్టాలా? మన కష్టాలకు కారణమైన కేసీఆర్‌ను తిట్టాలా? అని రేవంత్‌ ప్రశ్నించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రాజీవ్‌ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయడం ద్వారానే దిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు తనపై నమ్మకం ఏర్పడిందన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటే.. అందుకు రాహుల్‌గాంధీ అండగా నిలబడ్డారని రేవంత్‌ పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్‌ పట్ల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని