కేసీఆర్‌ రాజీనామా చేయాలి

ప్రధానాంశాలు

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

రైతుల ఆత్మహత్యలకు ఆయనదే బాధ్యత
  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌

ఈనాడు, న్యూస్‌టుడే - మెదక్‌: ‘రైతులు, నిరుద్యోగులు, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలి. నన్ను రాజీనామా చేయమంటూ కేటీఆర్‌ చేసిన సవాలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనన్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో అయిదుగురు అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందుకు కేసీఆర్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం మెదక్‌ జిల్లా మంబోజిపల్లి నుంచి మొదలైంది. మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాలో సభలోనూ, విలేకరుల సమావేశంలోనూ సంజయ్‌ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమాను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రూ.1,300 కోట్ల ఆర్టీసీ నిధిని రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుని, చివరకు ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సకలజనుల సమ్మె జరిగి పదేళ్లు పూర్తయినా, రాష్ట్ర సాధనకు శ్రమించిన ఉద్యోగులకు సీఎం ఏమీ చేయలేదని విమర్శించారు. పీఆర్సీ బకాయిలు పదవీ విరమణ తర్వాతో, ఉద్యోగి మరణించాకో ఇస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు. తక్షణం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

అవగాహన లేని కేటీఆర్‌

పన్నుల వసూలు, నిధుల కేటాయింపుపై మంత్రి కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సంజయ్‌ మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రాలకు పన్నుల రాబడిలో 32 శాతం వాటా ఇవ్వగా... భాజపా అధికారంలోకి వచ్చాక, దీన్ని 41 శాతానికి పెంచిందని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటున్న కేసీఆర్‌.. ప్రధానికి లేఖ రాయమని కోరితే స్పందించలేదన్నారు. నిధులు ఇవ్వని మాట వాస్తవమైతే ఇటీవల దిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. తెలంగాణకు మోదీ నిధులిస్తున్నారని, ఆయనకు రుణపడి ఉంటామని గతంలో చెప్పిన కేసీఆర్‌, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని సంజయ్‌ విమర్శించారు.

18 రోజులు.. 200 కిలోమీటర్లు

ప్రజా సంగ్రామ యాత్ర 18 రోజుల్లో 14 నియోజకవర్గాల మీదుగా 200 కిలోమీటర్లు పూర్తయిందని యాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, యువమోర్చా, దళితమోర్చా, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్‌, కొప్పు బాషా, గీతామూర్తి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మంత్రి బాబూమోహన్‌, పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని