ధాన్యం కొనాలని కేంద్రాన్ని భిక్షమడగట్లేదు

ప్రధానాంశాలు

ధాన్యం కొనాలని కేంద్రాన్ని భిక్షమడగట్లేదు

అది రైతులకు రాజ్యాంగం కల్పించిన హక్కు
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఒప్పించాలి
మంత్రి గంగుల కమలాకర్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రైతులు పండించిన పంటను సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, అది రాజ్యాంగం అన్నదాతలకు కల్పించిన హక్కని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ధాన్యం కొనాలని కేంద్రాన్ని భిక్షమడగటం లేదని పేర్కొన్నారు. మద్దతు ధర, కొనుగోలు, మార్కెటింగ్‌, ఎగుమతి, ధాన్యం నిల్వ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనివని చెప్పారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణలో యాసంగి సీజన్‌లో రైతులు పండించే ఉప్పుడు బియ్యాన్ని కిలో కూడా కొనుగోలు చేయమని ఈ నెల 1న కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ తేల్చిచెప్పడం బాధాకరం. పంజాబ్‌లో పండించిన మొత్తం ధాన్యాన్ని సేకరించిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు రాష్ట్ర రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలి. భారీగా ధాన్యం పండుతున్న తెలంగాణ రాష్ట్రంలో సేకరణ ఒప్పందాన్ని ఉన్నపళంగా ఎత్తేస్తే అన్నదాతలు అయోమయంలో పడతారు’’ అని మంత్రి పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని