ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి

ప్రధానాంశాలు

ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి

సీఎంకు బండి సంజయ్‌ లేఖ

మెదక్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భృతిపై అఖిలపక్ష, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం వహించినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర బుధవారం మెదక్‌ జిల్లా హవేలి ఘనపూర్‌ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో జరిగిన యాత్రలో నిరుద్యోగ యువతీ, యువకులు పలు సమస్యలను వెలిబుచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసగించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 31 శాఖల్లో 4.91 లక్షల ఉద్యోగాలకుగాను 3 లక్షల మందే పనిచేస్తున్నారు. 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయి. 1.07 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేసి ఏడేళ్లు అవుతున్నా గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాలే లేవు. గ్రూప్‌-2 నియామకాలను తూతూమంత్రంగా చేపట్టారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున భృతి ఇస్తామని గత ఎన్నికల్లో హామీనిచ్చారు. 2018 నుంచి నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలి’’ అని లేఖలో బండి సంజయ్‌ కోరారు.

ధాన్యం కొనుగోలుపై సీఎం స్పష్టతనివ్వాలి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: వరి వేస్తే ఉరేనని సీఎం కేసీఆర్‌ పేర్కొనడంతో ధాన్యాన్ని కొనరేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. దీనిపై స్పష్టతనివ్వాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర బుధవారం మెదక్‌ నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ, గోపాల్‌పేటలో నిర్వహించిన బహిరంగసభలోనూ ఆయన మాట్లాడారు. సీఎం ప్రకటనతో రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జిల్లాలో పాదయాత్ర సందర్భంగా పీజీ చదివిన నలుగురు నిరుద్యోగులు కూలీ పనులకు వెళ్తూ కనిపించారని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని