అమిత్‌ షా సమయమిస్తే ఆధారాలిస్తాం

ప్రధానాంశాలు

అమిత్‌ షా సమయమిస్తే ఆధారాలిస్తాం

సీఎం అవినీతిపై ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసినా కేంద్రం స్పందించడంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇస్తే కేసీఆర్‌ సీఎం అవటానికి ముందు, అయిన తర్వాత పాల్పడిన అవినీతికి ఆధారాలు అందజేస్తామన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతుండగా.. మరోవైపు ఆధారాలు లేవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. బెల్ట్‌షాపులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మద్యం మత్తులోనే పాశవిక దాడులు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. హైదరాబాద్‌లో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు పట్టుబడినట్లు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారని.. ఐదు రోజుల తర్వాత.. దొరకలేదని పోలీసులు ప్రకటించారని వెల్లడించారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా? అనే సందేహం తలెత్తుతోందన్నారు. చిన్నారిపై దారుణం జరిగిన కాలనీ హోంమంత్రి నివాసానికి సమీపంలోనే ఉందని.. అక్కడ గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా ఉన్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కాలనీని మంత్రి కేటీఆర్‌ దత్తత తీసుకున్నారని.. ఇలాంటి ఘటనలపై సీఎం ఎందుకు సమీక్షించడంలేదన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులోనూ కేసు వేసినట్లు తెలిపారు. బెంగళూరు, దిల్లీ, మహారాష్ట్రల్లో తీగలాగితే డ్రగ్స్‌ లింకులు హైదరాబాద్‌లో బయటపడుతున్నాయన్నారు.

అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌

ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరుతూ రేవంత్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి అంశాలతో పాటు డ్రగ్స్‌కి హైదరాబాద్‌ హబ్‌గా మారడం వంటి పరిస్థితులపై వివరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని