వాళ్లు నకిలీ హిందువులు

ప్రధానాంశాలు

వాళ్లు నకిలీ హిందువులు

భాజపా, ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ

దిల్లీ: ‘భాజపా, ఆరెస్సెస్‌ నేతలు నకిలీ హిందువులు, మతాన్ని స్వప్రయోజనాలకు వాడుకునే దళారులు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కాషాయదళంపై విరుచుకుపడగా.. ‘రాహుల్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ భాజపా ఎదురుదాడికి దిగింది. బుధవారం ఇక్కడ జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవంలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌ పార్టీ వారికి పూర్తి విరుద్ధం. ఈ దేశాన్ని ఏదో ఒక సిద్ధాంతమే పరిపాలించగలదు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌, మహాత్మాగాంధీల నడుమ ఉన్న తేడాలను గుర్తించాలి. అదేవిధంగా వీడీ సావర్కర్‌, నాథూరామ్‌ గాడ్సేల నడుమ కూడా’ అన్నారు. ‘మాది హిందూ పార్టీ అని వాళ్లు చెప్పుకొంటారు. గత 100-200 ఏళ్ల చరిత్రలో హిందూధర్మాన్ని గొప్పగా పాటించిన వ్యక్తి మహాత్మాగాంధీ. సత్యం, అహింస తన మార్గంగా జీవితాంతం హిందూధర్మాన్ని ఆచరణలో చూపిన మహాత్ముడి గుండెల్లోకి ఆర్‌ఎస్సెస్‌ సిద్ధాంతకర్తలు మూడు బుల్లెట్లు ఎలా దింపగలిగారు?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. ‘లక్ష్మీదేవిని సంపద కోసం, దుర్గాదేవిని రక్షణ కోసం పూజిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ, ఆర్టీఐ అమలు వంటి నిర్ణయాలతో ప్రజలపరంగా ఈ రెండు శక్తులను బలోపేతం చేశాం. మోదీ నోట్ల రద్దు ప్రకటించి.. జీఎస్టీ, కొత్త సాగు చట్టాలను తెచ్చారు. ఈ నిర్ణయాలతో దేశంలో ఆ రెండు శక్తులు బలోపేతం అయ్యాయా?’ అని రాహుల్‌ ప్రశ్నించగా.. ‘ఇంకా దిగజారాయి’ అంటూ మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు స్పందించారు.  
మరోవైపు.. ‘రాహుల్‌గాంధీ ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటారు. ఆయనకు వాస్తవాలేం తెలుస్తాయి? ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారు’ అంటూ కాంగ్రెస్‌ నేతపై భాజపా ప్రతివిమర్శలు చేసింది. ‘రాహుల్‌గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ప్రజలకు దూరంగా ఉండే ఆయనకు సమాచారలోపమే పెద్ద సమస్య’ అని  భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని