రాజీనామా చేసీ ప్రజల రుణం తీర్చుకుంటున్నా

ప్రధానాంశాలు

రాజీనామా చేసీ ప్రజల రుణం తీర్చుకుంటున్నా

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: రాజీనామా చేసి కూడా ప్రజల రుణం తీర్చుకుంటున్నందుకు గర్వపడుతున్నానని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక లోపే దళితబంధు పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షలు వినియోగించుకునే పూర్తిస్వేచ్ఛ లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశంలో దమ్మక్కపేటకు చెందిన పలువురు ఈటల సమక్షంలో భాజపాలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా వల్లే గొర్రెలు, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పించగలిగాననే సంతృప్తి తనకు దక్కిందన్నారు. గతంలో ఇచ్చిన హామీల మాదిరిగానే దళితబంధు అమలవుతుందో? లేదో? అనే భయం మాత్రం వెంటాడుతోందన్నారు. కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లోని పేదలకు రూ.10 లక్షలు ఇవ్వాలని, సొంత జాగా ఉన్నవాళ్లకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టానంటూ మంత్రి హరీశ్‌రావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను గడ్డిపోచలాగా ఊదెయ్యాలనుకున్నారని, గడ్డిపోచ కాదు.. గడ్డపార అని వారికి ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘‘నీ బొమ్మ పెడితేనే నాకు ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మరి నీ బొమ్మ పెట్టుకున్న వినోద్‌కుమార్‌, నీ బిడ్డ కవిత ఎందుకు ఓడిపోయారో చెప్పాలని’’ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని