తితిదే బోర్డులో నేరస్థులు, అవినీతిపరులా?

ప్రధానాంశాలు

తితిదే బోర్డులో నేరస్థులు, అవినీతిపరులా?

ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌- అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా.. రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో 81 మందితో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. భక్తిభావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన తితిదే బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల్ని, అనర్హులను సభ్యులుగా నియమించి పవిత్రతను దెబ్బతీశారని, శ్రీవారి ఆలయ ప్రతిష్ఠను కించపరిచారని దుయ్యబట్టారు. తక్షణమే దానిని రద్దు చేసి, సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని శుక్రవారం ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వామి వారిపై భక్తిభావంతో.. శ్రీవారి సేవలో తరించే వారికి ప్రాధాన్యమివ్వకుండా.. కొందరు వ్యక్తుల సేవలో మునిగే వారికి అవకాశమిచ్చారన్న అంశం సుస్పష్టం. గతంలో ఏ సీఎం హయాంలోనూ ఇంతమందితో ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఆ నియామకాలను స్వప్రయోజనాల కోసం చేశారు. పాలకమండలిని రాజకీయ నిరుద్యోగుల కేంద్రంగా మార్చారు’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని