అమిత్‌షా మాటల్లో తప్పు ఏముంది?

ప్రధానాంశాలు

అమిత్‌షా మాటల్లో తప్పు ఏముంది?

వాస్తవాలు మాట్లాడితే.. మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?
బండి సంజయ్‌ వ్యాఖ్య
భాజపా రాష్ట్ర అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్‌ సభలో చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ‘‘మత విద్వేషాలు రగిల్చేలా అమిత్‌షా మాట్లాడారని కొందరు తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదంటే అది మతతత్వమా? కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది. ఆ పార్టీ చేతిలో తెరాస కీలుబొమ్మగా మారిందని అంటే మతతత్వం అవుతుందా?’’ అని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మత రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం. తెరాస, మజ్లిస్‌ పార్టీలను ఓడించినప్పుడే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ లభిస్తుందని అమిత్‌షా చెప్పారు. అందులో తప్పు ఏముందో ప్రజలు ఆలోచించాలి’’ అని కోరారు.

కేంద్రం నిధులివ్వడం లేదని నిరూపిస్తే రాజీనామా

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మనం ఇద్దరం ప్రధాని వద్దకు వెళదాం. నిధుల విషయంలో కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని నిరూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేస్తా. కేంద్రమే ఎక్కువ నిధులిస్తోందని నిరూపిస్తే సీఎం రాజీనామాకు సిద్ధమా?’’ అని సంజయ్‌ సవాల్‌ విసిరారు. కొందరు పనిలేని కాంగ్రెస్‌ నేతలు తెరాస, భాజపా ఒక్కటేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లకు తెరాస కెప్టెన్‌ అయితే, ఎంఐఎం వైస్‌ కెప్టెన్‌, కాంగ్రెస్‌ నేతలు ఎక్స్‌ట్రా ప్లేయర్ల లాంటి వారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీకి పోయి చెప్పేదొకటి, జరిగేదొకటని.. రాష్ట్రానికి వేల కంపెనీలు వచ్చాయన్న సీఎం ప్రకటనలూ వాస్తవం కాదని పేర్కొన్నారు. సభలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని, ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు.

డ్రోన్‌ కెమెరా రెక్కలకు పూలు తగిలి

ప్రజా సంగ్రామ పాదయాత్రలో బండి సంజయ్‌కు ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల గేట్‌ వద్ద అభిమానులు పైకి విసిరిన పూలు తగిలి.. పై నుంచి వీడియో రికార్డింగ్‌ చేస్తున్న డ్రోన్‌ కెమెరా పడిపోయింది. సరిగ్గా అది సంజయ్‌ మీద పడబోతుండగా సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. శనివారం బండి సంజయ్‌ 13.8 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని