పదవిని కొనుక్కున్న నీవు సీఎంను దూషించడమా?

ప్రధానాంశాలు

పదవిని కొనుక్కున్న నీవు సీఎంను దూషించడమా?

కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోం
రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ధ్వజం

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: పీసీసీ పదవిని కొనుగోలు చేసిన వ్యక్తి.. సీఎం కేసీఆర్‌ను దూషించడమా అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆదివారం మేడ్చల్‌-మల్కాజిరి జిల్లా జవహర్‌నగర్‌ 3వ డివిజన్‌లో తెరాస కార్యాలయ ప్రారంభోత్సవంలో మేయర్‌ మేకల కావ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాసలో చేరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ‘ఖబడ్దార్‌ రేవంత్‌.. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోం...నీ సంగతి చూస్తాం. నిన్ను వదిలేది లేదు’ అంటూ హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ మిమ్మల్ని కొడతారంటూ మండిపడ్డారు. చర్లపల్లి జెలుకెళ్లొచ్చిన రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని