కెప్టెన్‌ తొలగింపుతో సంకేతాలెన్నో!

ప్రధానాంశాలు

కెప్టెన్‌ తొలగింపుతో సంకేతాలెన్నో!

గహ్లోత్‌, బఘేల్‌లకూ పరోక్ష సూచనలు
కాంగ్రెస్‌పై అధిష్ఠానానికి పూర్తి పట్టు

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అర్ధాంతర నిష్క్రమణ కాంగ్రెస్‌ నేతలకు పలు సంకేతాలు పంపిస్తోంది. ఎమ్మెల్యేలంతా తమకే విధేయులుగా ఉంటారే తప్ప రాష్ట్ర నాయకులకు కాదన్న సందేశాన్ని అధిష్ఠానం వారికి పంపగలిగింది. తమను విస్మరించడంగానీ, తమ మాటను కాదనడంగానీ చేయలేరన్న సూచనలు ఇవ్వగలిగింది. అందుకే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ పంజాబ్‌ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగింది. తద్వారా పార్టీపై అధిష్ఠానం పూర్తిగా పట్టు సాధించినట్టు స్పష్టమవుతోంది. దీంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌లకు విషయం అర్థమయ్యేలా చేసింది. మంత్రివర్గంలో యువనేత సచిన్‌ పైలట్‌ వర్గీయులకు చోటు కల్పించాలన్న సలహాను గహ్లోత్‌ పట్టించుకోవడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఆరోగ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌తో చెరిసగం పదవీకాలం పంచుకోవాలన్న సూచనను బఘేల్‌ అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో జైపుర్‌, రాయ్‌పుర్‌లకు పార్టీ పరిశీలకులను పంపించి, ముఖ్యమంత్రులను మార్చాలని కోరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉందో తెలుసుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అసమ్మతిని వారే ప్రోత్సహించారా?

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అందరికీ అసమ్మతి బెడద ఉంది. అసమ్మతి నాయకులు అందరూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తమ సమస్యలను వివరించారు. అయితే ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో తమను పట్టించుకోవడం లేదన్న భావన కూడా ఉంది. మరోవైపు పంజాబ్‌లో అసమ్మతిని రాహుల్‌-ప్రియాంకలు ప్రోత్సహించారని, ఇందుకు సోనియా మౌనంగా ఆమోదించారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. రాహుల్‌, ప్రియాంకలకు తాను సన్నిహితుడినంటూ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పలుమార్లు ప్రకటించుకున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు చెప్పి భవిష్యత్తు నాయకుడిని తానేనంటూ వారిలో అభిప్రాయం కలిగేలా చూసుకున్నారు. అసమ్మతి వ్యవహారాలు తలెత్తినప్పుడు గాంధీ కుటుంబం బహిరంగంగా ఒక పక్షంవైపు మొగ్గు చూపడం బహుశా ఇదే తొలిసారి అయి ఉంటుందన్న వ్యాఖ్యానాలు కూడా వస్తున్నాయి. ఒక విశ్లేషకుడు చెప్పిన అభిప్రాయం ప్రకారం...‘‘కెప్టెన్‌ అమరీందర్‌కు అవమానం కలిగించడం సోనియాకు ఏ మాత్రం ఇష్టం లేదు. పంజాబ్‌పై నిర్ణయాన్ని రాహుల్‌-ప్రియాంకలే తీసుకున్నారు. అయితే కెప్టెన్‌ను తొలగించే అధికారం వారిద్దరికీ లేదు. రాహుల్‌కు పార్టీలో అధికారికంగా ఎలాంటి పదవీ లేదు. ప్రియాంక ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలను చూస్తున్నారు. ఎన్నికల్లో విజయాలు సాధించి పెట్టిన ఘనతా వారికి లేదు. కానీ పార్టీపై పట్టు ఉందని నిరూపించుకోవడానికి అసమ్మతిని వారే ప్రోత్సహించారు. కెప్టెన్‌ను గౌరవ ప్రదంగా పంపించకుండా సోనియా కూడా తప్పు చేశారు’’ అని అభిప్రాయపడ్డారు.

భాజపా ఆకర్షిస్తుందా?

అమరీందర్‌ను భాజపా ఆకర్షిస్తుందన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఆయనకు మోదీ-షాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. పంజాబ్‌లో భాజపాకు చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరూ లేకపోవడంతో ఆయనను చేర్చుకొని సీఎం అభ్యర్థి అన్న ప్రచారం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని చోట్ల తిరుగుబాట్లు

పంజాబ్‌ నిర్ణయం కారణంగా మరికొన్ని రాష్ట్రాల్లో తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ నాయకులు కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నాయకులు పార్టీని వీడుతున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదని, చివరకు పార్టీని బలహీన పరుస్తాయని చెబుతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని