ఉద్యమ ద్రోహులతోనే పాలన

ప్రధానాంశాలు

ఉద్యమ ద్రోహులతోనే పాలన

ప్రస్తుతం వారినే కేసీఆర్‌ పక్కన పెట్టుకున్నారు
పోడు భూములపై ఆందోళన చేస్తే అక్రమ కేసులు
సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ విమర్శ

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులుగా పనిచేసిన వారిని కుడి, ఎడమలుగా పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. 1400 మంది బలిదానాలతోనే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్‌, ఆయన కుటుంబం చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పాలనలో మేధావులను దూరం పెట్టారని.., ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఉరికించి కొడతామన్న నేతలను పక్కనపెట్టుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ప్రజలనుద్దేశించి సంజయ్‌ ప్రసంగించారు. తాతముత్తాతల నుంచి గిరిజనులు, దళితులు సాగు చేసుకుంటున్న పోడు భూములను హరితహారం పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాటికి పట్టాలివ్వాలని గుర్రంబోడు వద్ద భాజపా నేతలు, కార్యకర్తలు ఆందోళన చేయగా.. 30 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారన్నారు. కేసీఆర్‌ పాలన రాకముందు కిలోమీటరుకో పాఠశాల ఉండేదని... ప్రస్తుతం కిలోమీటరుకో మద్యం షాపు, బార్‌లకు లైసెన్స్‌ ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి పింఛన్లు ఇస్తామంటే విద్వేషమా అని ప్రశ్నించారు.

హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదు

భాజపా ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. కానీ హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని సంజయ్‌ తెలిపారు. దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యం కాకూడదని.. మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టి ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని వివరించారు. కేసీఆర్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నారా.. సమర్థిస్తున్నారా.. చెప్పాలని డిమాండు చేశారు. జీడీపీ పెరిగితే రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య ఎందుకు పెరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్‌ సభకు వచ్చిన స్పందనను చూసిన కేసీఆర్‌ తన మార్కు రాజకీయం ప్రారంభించారని సంజయ్‌ ఎద్దేవా చేశారు.


2న హుజూరాబాద్‌లో భాజపా బహిరంగ సభ
పాదయాత్ర ముగింపునకు జేపీ నడ్డా

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో అక్టోబరు 2న బహిరంగ సభ నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలివిడత ఆరోజుతో ముగియనుంది. పాదయాత్ర ముగింపునకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించారు. ముగింపు సభ గురించి సంజయ్‌ పార్టీ నేతలతో ఆదివారం చర్చించారు. మంగళవారం చేపట్టనున్న పాదయాత్రలో కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ పాల్గొననున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని