చిత్తశుద్ధి ఉంటే రైతులకు వెంటనే పరిహారం ఇవ్వండి

ప్రధానాంశాలు

చిత్తశుద్ధి ఉంటే రైతులకు వెంటనే పరిహారం ఇవ్వండి

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ గుండె పేదలు, రైతుల సమస్యలపై స్పందించడం మానేసిందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బండరావిరాల, చిన్నరావిరాలలో మైనింగ్‌ జోన్‌లో భూములు కోల్పోయి 17 ఏళ్లయినా పరిహారం ఇవ్వలేదంటూ నిర్వాసిత రైతులు చేపట్టిన నిరసన దీక్షకు ప్రవీణ్‌కుమార్‌ సోమవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, దళితులపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రులను, కలెక్టర్లను పంపి నిర్వాసితులకు పరిహారం అందించే వారన్నారు. రైతుల గోసను దిల్లీ వరకు వినిపిస్తామన్నారు. సీఎం బంధువు కుటుంబ సభ్యుల భూములు మధ్యమానేరు ప్రాజెక్టులో పోతే గంటల వ్యవధిలోనే పరిహారం ఇచ్చిన ప్రభుత్వం.. 17 ఏళ్లుగా పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిహారం ఇస్తామని స్వయంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలన్నారు. ఏడాది ఆగితే ‘ఏనుగు’పై ప్రగతిభవన్‌కు చేరుకుందామని, అప్పుడు బీఎస్పీ ప్రభుత్వం రూ.150 కోట్ల పరిహారం చెక్కును ఇక్కడికే తెచ్చి రైతులకు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో భూనిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు దానేష్‌, అధ్యక్షుడు అయిలయ్య, బీఎస్పీ నాయకులు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని