వచ్చేనెల నుంచి ప్రజా ప్రస్థాన యాత్ర

ప్రధానాంశాలు

వచ్చేనెల నుంచి ప్రజా ప్రస్థాన యాత్ర

అక్టోబరు 20న చేవెళ్లలో శ్రీకారం

90 నియోజకవర్గాల్లో ఏడాది పాటు వైతెపా అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని పాలకులు ఎలా భ్రష్టు పట్టించారో చెప్పాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌, భాజపా కేసీఆర్‌కు అమ్ముడు పోయాయని ఆరోపించారు. ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పార్టీ వచ్చిందన్నారు. ప్రజా సమస్యలు విని.. వాటికి పరిష్కారం కోసమే ఏడాది పాటు ప్రజా ప్రస్థాన యాత్ర చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి అక్టోబరు 20న యాత్రను ఆరంభించనున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్‌, ఏపూరి సోమన్న, బాణోత్‌ సుజాత, సత్యవతిలతో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు.

ఏడేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు

‘ఏడేళ్ల పాలనలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు లక్షల మందికి రుణమాఫీ అమలు చేసి ముప్ఫై లక్షల మందికి ఎగ్గొట్టారు. 16 లక్షల మంది కౌలు రైతులు దిక్కులేకుండా పోయారు. రాష్ట్రంలో దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయి. అదే సమయంలో 300 శాతం మద్యం అమ్మకాలు హెచ్చాయి. చిన్నపిల్లల మానప్రాణాలకు రక్షణ లేదు. ఏడేళ్లలో రూ.నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు. కనీసం ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు. కొత్త కొలువులు లేవు. ఇలా రాష్ట్రంలో పోరాడాల్సిన సమస్యలెన్నో ఉన్నాయి. అందుకే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. యాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఏడాది పాటు 90 నియోజకవర్గాల్లో సాగుతుంది. మహానగర పాలక సంస్థ పరిధి మినహా రాష్ట్రం మొత్తం చేపడతాం. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను పాదయాత్రలోనూ కొనసాగిస్తాం’ అని షర్మిల పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని