నైతికత లేని ఎన్నికలపై మాట్లాడను

ప్రధానాంశాలు

నైతికత లేని ఎన్నికలపై మాట్లాడను

ఏపీ పరిషత్‌ ఫలితాలపై తెదేపా అధినేత చంద్రబాబు

మంద కృష్ణమాదిగను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

విద్యానగర్‌, అంబర్‌పేట, న్యూస్‌టుడే: వైకాపా వైఖరికి నిరసనగా ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తొలుతే తాము బహిష్కరించామని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాము బహిష్కరించిన, నైతికత లేని ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. దిల్లీలో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను సోమవారం ఆయన పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేరాలకు పాల్పడలేదని వివరించారు. తాము రౌడీయిజం చేయాలనుకుంటే వారు బయటకు వచ్చేవారు కాదన్నారు. ఏపీలో తెదేపాను ఎవరూ ఏం చేయలేరని, వారు పెట్టేవన్నీ తాత్కాలిక ఇబ్బందులేనని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని వివరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న తనపైనే తప్పుడు కేసులు బనాయించారన్నారు. కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ త్వరగా జరిగేలా సహకరించాలని కోరారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నేతలు టీడీ జనార్దన్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు చంద్రబాబు వెంట ఉన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని