దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టండి

ప్రధానాంశాలు

దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టండి

సీఎంకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తెరాస ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చేసిన ప్రజాద్రోహంపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని, దమ్ముంటే తనపై రాజద్రోహం కేసు పెట్టాలని కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎంని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించని కేసీఆర్‌పై దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టాలి. ఆయనతో ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజాద్రోహ ప్రభుత్వాన్ని కూల్చాలి’’ అని సంజయ్‌ పిలుపునిచ్చారు.

ఏ సవాల్‌కైనా సిద్ధం

‘‘డ్రగ్స్‌పై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నాకు సవాల్‌ విసిరారు. నాకు ఏ అలవాటు లేదు. ప్రజాసంగ్రామ యాత్ర ముగిసిన అనంతరం దేనికైనా సిద్ధమే. యాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రజల దృష్టి మళ్లించేందుకే తెరాస, కాంగ్రెస్‌లు వైట్‌ ఛాలెంజ్‌ పేరుతో నాటకాలు ఆడుతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

పోడు సమస్యను పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ ముట్టడి

పోడు భూముల సమస్యను పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని సంజయ్‌ అన్నారు. కొవిడ్‌ కాలంలో ప్రాణాలకు వెరవకుండా సేవలందించిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్యులు, ఏఎన్‌ఎంలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తే కొవిడ్‌ బాధితులకు లబ్ధి కలిగేదని, కేంద్ర పథకాలను అమలు చేస్తే మోదీకి పేరొస్తుందని వాటిని దూరం పెడుతున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని