యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్‌ ఛాలెంజ్‌

ప్రధానాంశాలు

యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్‌ ఛాలెంజ్‌

సవాల్‌ స్వీకరించకుండా కోర్టుకు ఎందుకు?

ఇప్పటికైనా కేటీఆర్‌ ముందుకు రావాలి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా యువతరానికి ఆదర్శంగా ఉండాలనే వైట్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదన చేశానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పరీక్షల నిమిత్తం రక్తం, వెంట్రుకలను ఇచ్చి చిత్తశుద్ధిని చాటుతూ యువతలో విశ్వాసాన్ని కల్పించాలన్నదే తన ఆలోచన తప్ప ఇందులో రాజకీయం, ఎన్నికల ప్రయోజనాలు లేవన్నారు. సోమవారం 12 గంటలకు గన్‌పార్క్‌ వద్దకు రావాలని మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సవాల్‌ విసిరిన రేవంత్‌రెడ్డి.. ఆ సమయానికి అక్కడికి వచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డి సైతం అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో గన్‌పార్క్‌ వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డ్రగ్స్‌ వ్యవహారంతో తనకేం సంబంధం లేదని, కావాలంటే రక్తం, వెంట్రుకల నమూనాలిస్తానని కేటీఆర్‌ చెప్పారనే సవాల్‌ విసిరా. ప్రజాప్రతినిధులు పరీక్షలు చేయించుకుని నివేదికలను ప్రజలకు చూపితే యువతలో మార్పు వస్తుందని భావించా. దీనికి కేటీఆర్‌ స్పందించకపోగా దూషిస్తున్నారు. రాహుల్‌గాంధీ పరీక్షలు చేయించుకుంటేనే తాను సిద్ధమంటున్నారు.. పరీక్షలకు ఇవాంకా ట్రంప్‌ రావాలంటారేమో. సవాల్‌ స్వీకరించాలంటే కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు? కేటీఆర్‌ సీఎం కుమారుడు మాత్రమే కాదు.. మంత్రిగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ జవాబుదారీగా ఉండాలి. రేపయినా సరే కేటీఆర్‌ వైట్‌ ఛాలెంజ్‌ స్వీకరించాలి. గంట ముందు చెప్పినా నేను, విశ్వేశ్వర్‌రెడ్డి వస్తాం.

ఇదేనా ప్రజలు కోరుకున్న తెలంగాణ?

హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని, శాంతిభద్రతలు కాపాడి నేరరహిత తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల అత్యంత పాశవికంగా చిన్నారిపై హత్యాచారం ఘటనను గుర్తుకు తెచ్చుకోవాలి. కేటీఆర్‌ దత్తత తీసుకున్న ప్రాంతంలోనూ మాదకద్రవ్యాలు, గంజాయి దొరుకుతున్నాయి. హైదరాబాద్‌లో 60 పబ్‌లకు అనుమతిచ్చారు. ఇదేనా ప్రజలు కోరుకున్న తెలంగాణ’’ అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా అన్న కేటీఆర్‌ సవాల్‌కు ట్విటర్‌లో రేవంత్‌ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమేనన్నారు. కొండా విశేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైట్‌ ఛాలెంజ్‌ అనేది సమాజానికి ఆదర్శవంతంగా ఉంటుంది. ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్థి నేర చరిత్రను, ఇతర వివరాలను సమర్పించాలని ఎన్నికల కమిషన్‌ చెబుతుంది. అలాగే ‘డ్రగ్‌ టెస్ట్‌’నూ తీసుకోవాలి’’ అని చెప్పారు.


ఏమిటీ వైట్‌ ఛాలెంజ్‌?

ఈనాడు, హైదరాబాద్‌: సినీనటులు, ఇతర ప్రముఖులపై మాదక ద్రవ్యాల కేసుల ఆరోపణల నేపథ్యంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌ వద్దకు వస్తే.. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి రక్త నమూనాలు, వెంట్రుకలు ఇచ్చి వద్దామని పేర్కొన్నారు. వైట్‌ ఛాలెంజ్‌ను విశ్వేశ్వర్‌రెడ్డి స్వీకరించి సోమవారం గన్‌పార్క్‌ వద్దకు వచ్చారు.భాజపా అధ్యక్షుడు సంజయ్‌, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లకు ఆయన వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు. దాన్ని తాను స్వీకరిస్తున్నట్లు సంజయ్‌ ప్రకటించారు.


 
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని