రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

ప్రధానాంశాలు

రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్‌ కార్యకర్తలు, తెరాస విద్యార్థి నేతల పరస్పర దాడులు

నిలువరించిన పోలీసులు

జూబ్లీహిల్స్‌, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: డ్రగ్స్‌ విషయంలో మంత్రి కేటీఆర్‌ను అవమానించేలా మాట్లాడారంటూ తెరాస విద్యార్థి విభాగం నేతలు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మొదట తెరాసవివి నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి దిష్టిబొమ్మతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎస్సై యాకన్న సిబ్బందితో వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు తెరాసవివి నేతలపై కర్రలతో దాడికి దిగారు. దీంతో తెరాస విద్యార్థి విభాగం నేతలు సైతం రాళ్లతో ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ పరస్పర దాడుల్లో విద్యార్థి నాయకులు స్వామియాదవ్‌, జహీర్‌లు స్వల్పగాయాలపాలయ్యారు. పోలీసులు రెండు వర్గాల వారిని శాంతింపజేశారు. అనంతరం గాయాలపాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. ఆందోళనకు దిగిన వారిలో కటారి స్వామియాదవ్‌, జహీర్‌ఖాన్‌తోపాటు నిమ్మల కోటి నవీన్‌, షఫీ, కలీం, కానం జైపాల్‌, కె.లోకేష్‌, రాజు, రమణ, పండుగౌడ్‌ తదితరులు ఉన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై రేవంత్‌రెడ్డి అనుచరులు అకారణంగా కర్రలతో దాడి చేశారని తెరాస విద్యార్థి విభాగంనేతలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లేదారిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇలాంటి చర్యలు అప్రజాస్వామికం: కాంగ్రెస్‌

పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇంటిపై తెరాస నాయకుల దాడిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, ఆదివాసీ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్‌, తదితరులు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెరాస నాయకుల చర్యలు అప్రజాస్వామికమన్నారు. మాదక ద్రవ్యాల రహిత(డ్రగ్స్‌ ఫ్రీ) తెలంగాణ కోసం రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే మంత్రి కేటీఆర్‌ సహకరించాల్సిందిపోయి ఇలా దాడులకు ఉసిగొలుపుతారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తలుచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగగలరా అని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని